అప్పుల బాధతో వ్యక్తి ..
● సముద్రాలలో ఘటన
స్టేషన్‌ఘన్‌పూర్: అదనపు కట్నం వేఽధింపులతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం సముద్రాలలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జఫర్‌గఢ్‌కు చెందిన కోల ప్రతాప్ తన కుమార్తె సోని(28)ని ఐదేళ్ల క్రితం స్టేషన్‌ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామానికి చెందిన తాడెం అనిల్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. వివాహ సమయంలో కట్నంగా రూ.5లక్షల నగదు, ఆరు తులాల బంగారంతో పాటు జఫర్‌గఢ్‌లో ఉన్న 100 గజాల ప్లాట్ అందించారు. కొంతకాలం వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. ఈ దంపతులకు నాలుగేళ్ల వయస్సున్న కన్వీక్, ఏడాది వయస్సున్న క్రిష్విక్ ఉన్నారు. ఈ క్రమంలో అనిల్ తన భార్య వద్ద ఆరు తులాల బంగారాన్ని తన సొంత ఖర్చులకు అమ్ముకోవడంతోపాటు రెండేళ్ల క్రితం మరో యువతితో సంబంధం పెట్టుకుని సోనిని మానసికంగా, శారీరంగా వేధిస్తున్నాడు. ఈ విషయమై పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా సోనిని మంచిగా చూసుకుంటానని ఒప్పుకోవడంతో అనిల్ వద్దకు పంపించారు. అయితే పదిహేను రోజుల నుంచి అనిల్ అదనపు కట్నం కోసం సోనిని వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని సోని తన తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా చెప్పింది. ఈ క్రమంలో ఈనెల 8న అనిల్ తాగొచ్చి రూ.5లక్షల అదనపు కట్నం తీసుకురావాలని దాడికి పాల్పడ్డాడు. ఈఘటనపై మనస్తాపం చెందిన సోని అదే రోజు (శనివారం) రాత్రి గడ్డిమందు తాగి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే మృతురాలి తల్లి, సోదరుడు.. అనిల్‌కు ఫోన్ చేయగా అంబులెన్స్‌లో హనుకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతిచెందింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి కోల ప్రతాప్ ఫిర్యాదు మేరకు అనిల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్‌కుమార్ తెలిపారు.
మహాముత్తారం: అప్పుల బాధతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఊకంటి మనోహర్‌రెడ్డి(45) కుటుంబపోషణతోపాటు పిల్లల చదువులకు అప్పు చేశాడు. ఎలా తీర్చాలో తెలియక కొన్ని రోజులుగా మనస్తాపం చెందుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం బయటకు వెళ్లి వస్తానని భార్యకు చెప్పి గ్రామ సమీపంలోని అడవిలో ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన బాటసారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు భూపాలపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై దాట్ల కుమారస్వామి తెలిపారు.


