తిరుమలాయపాలెం: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలులో ఇటీవల జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈమేరకు ఆదివారం తిరుమలాయపాలెం పోలీసుస్టేషన్‌లో ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి వెల్లడించిన వివరాలు.. పిండిప్రోలుకు చెందిన ఐతనబోయిన ప్రశాంత్ చికెన్‌షాపు నిర్వహిస్తున్నాడు. మద్యానికి బానిస కావడమే కాక ఆన్‌లైన్ గేమ్‌లతో అప్పుల పాలయ్యాడు. షాప్ పక్కనే వృద్ధులైన చెన్న సుగుణ – జనార్దన్ దంపతులు ఉండడం, సుగుణ మెడలో బంగారు ఆభరణాలు ఉండడంతో చోరీకి నిర్ణయించుకున్నాడు. గత నెల 17న అర్ధరాత్రి వ్యాన్ రావడంతో కోళ్లు తీసుకున్న ప్రశాంత్, మాస్క్ ధరించి ఇంటి వెనక వైపు నుంచి వెళ్లి తలుపు కొట్టి నీళ్లు కావాలని అడిగాడు. దీంతో సుగుణ తలుపు తీసి నీళ్లు ఇస్తుండగా ఆమె మెడలోని బంగారు గొలుసు లాగాడు. అప్రమత్తమైన ఆమె పక్కనే డబ్బాలోని కారం గుప్పించి మాస్క్ తొలగించి ప్రశాంత్‌ను గుర్తుపట్టింది. దీంతో ఆందోళనకు గురైన ఆయన ఇనుపరాడ్డుతో ఆమె తలపై మోదగా కన్నుమూసింది. అనంతరం గొలుసును దాచి పెట్టి ఇంటికి వెళ్లిన ఆయన తెల్లవారునుంచే ఏమీ తెలియనట్లే వ్యవహరించాడు. కూసుమంచి సీఐ సంజీవ్ నేతృత్వాన ప్రత్యేక బృందాలు గ్రామాన్ని జల్లెడ పట్టినా క్లూ లభించలేదు. ఆతర్వాత ప్రశాంత్ 25 గ్రాముల బంగారు గొలుసును తన సమీప బంధువైన మరిపెడ మండలం ధర్మారానికి చెందిన సరగండ్ల మహేష్‌కు ఇచ్చి ఆయన ద్వారా తాకట్టు పెట్టాక రూ.1.50లక్షల నగదు ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. దర్యాప్తులో భాగంగా పలువురి కాల్‌డేటా, ఆర్థిక లావాదేవీలు పరిశీలిస్తుండగా ప్రశాంత్‌పై అనుమానం వచ్చింది. దీంతో మహేష్‌ని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. ఈమేరకు నిందితుడు ప్రశాంత్‌తో పాటు బంగారం తాకట్టుకు సహరించిన మహేష్‌ను సైతం అరెస్ట్ చేశారు.
కాల్‌డేట్, నగదు లావాదేవీల ఆధారంగా
నిందితుల అరెస్ట్


