జఫర్‌గఢ్ : జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం సాగరం గ్రామంలోని దుర్గమ్మ ఆలయంలో దుండగులు శనివారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. గ్రామస్తు ల కథనం ప్రకారం.. దుండగులు తాళం పగలగొట్టి ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారి వెండి కళ్లతో పా టు హుండీలను పగలగొట్టి భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేశారు. వీటితో పాటు కొంత నగదు కూడా అపహరించారు. అమ్మవారికి సంబంధించిన వెండి కళ్లు విలువ రూ. 25 వేలు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై సర్పంచ్ తాటికాయల మమత చేతన్‌కుమార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ పట్టణంలోని కురవి గేట్ ప్రాంతంలో నివాసం ఉంటున్న బండి అనూష ల్యాప్‌టాప్ చోరీకి గురైందని టౌన్ సీఐ ఎల్.రఘుపతిరెడ్డి ఆదివారం తెలిపారు. అనూష ఈ నెల 8వ తేదీన ఉదయం కుటుంబ సమేతంగా వరంగల్‌కు వెళ్లి రాత్రి సమయంలో ఇంటికి వచ్చింది. అప్పటికే తాళాలు పగలగొట్టి ఇంటి తలుపు తెరిచి ఉన్నాయి. దీంతో అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న దుస్తులు, వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. అలాగే, ల్యాప్ టాప్ కూడా కనిపించ లేదు. దీంతో చోరీ జరిగిందని గుర్తించి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా టౌన్ ఎస్సై జి.సుదర్శన్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారని సీఐ తెలిపారు.


