● నియోజకవర్గంలో విషాదం
జనగామ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అప్పటి చేర్యాల మాజీ ఎమ్మెల్యే గొర్రె సిద్ధయ్య (95) అనారోగ్యంతో హైదరాబాద్ పద్మారావు నగర్‌లోని తన నివాసంలో ఆదివారం కన్నుమూశారు. అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం బైరాన్ పల్లికి చెందిన సిద్ధయ్య 1978లో చేర్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్(ఐ) అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 1983, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. రాజకీయాల్లో సుదీర్ఘ కాలం కొనసాగిన సిద్ధయ్యకు 2019 అసెంబ్లీ ఎన్నికల వరకు జనగామ నియోజకవర్గంపై ప్రత్యేక అనుబంధం ఉండేది. కాగా, సిద్ధయ్య ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బచ్చన్నపేట మండలానికి 30 పడకల ఆస్పత్రి మంజూరు చేయించడంలో కీలకంగా కృషి చేశారని స్థానిక కాంగ్రెస్ నాయకులు గుర్తుచేశారు. గొర్రె సిద్ధయ్య మృతిపై కాంగ్రెస్ శ్రేణులు విచారం వ్యక్తం చేశారు. కొత్తపెల్లి రాజయ్య తదితరులు సంతాపం తెలిపారు.


