ఆదివాసీ.. మానవాళికి మూలవాసి | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీ.. మానవాళికి మూలవాసి

Aug 9 2026 1:58 AM | Updated on Aug 9 2026 1:58 AM

నేడు ఏటూరునాగారంలో వేడుకలు

వర్షపు నీరే

మినరల్‌గా..

కారు చీకట్లలోనే కాలం వెళ్లదీత..

ప్రకృతితో పెనవేసుకుని జీవిస్తున్న గొత్తికోయలు

ఏటూరునాగారం: ఆదివాసీలు.. మానవాళి మూలవాసులు. వీరి జీవనం పూర్తిగా ప్రకృతితో పెనవేసుకుని ఉంటుంది. కట్టు, బొట్టూ.. ఆహారం, ఆహార్యం.. వేషధారణ, వస్త్ర ధారణ, ఆలోచన, ఆచారాలు పూర్తిగా మైదాన ప్రాంతవాసులకు భిన్నం. అడవి తల్లే వీరి జీవనాధారం. గుట్టలు, గూడేలే వీరి ఆవాసం. అడవుల్లోనే జీవించే ఆదివాసీలు నేటికీ సంస్కృతి, సంప్రదాయాలను ఆచరిస్తూ నవజీవనాన్ని కొనసాగిస్తున్నారు. పండుగలు, శుభాకార్యాలను సైతం తమ కట్టుబాట్లు, నిబంధల మేరకే కొనసాగించుకుంటూ తమకంటూ ఓ జీవన విధానాన్ని ఏర్పరుచుకున్నారు. ఈ క్ర మంలో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈ సందర్భంగా వారి జీవనం విధానం, అభివృద్ధి, తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

సేంద్రియ వ్యవసాయం..

నేటి సమాజంలో ఏ పంట దిగుబడి తీయాలన్నా రసాయన ఎరువులను అధికంగా వాడడం గమనార్హం. కానీ ఏజెన్సీలోని గొత్తికోయలు, ఆదివాసీలు సేంద్రియ వ్యవసాయం పాటిస్తున్నారు. కేవలం పశువుల పేడ, వేప ఆకులతో పంటలు పండిస్తున్నారు. కల్తీ లేని పంటలు పండించుకుంటున్నారు. ఇంటి చుట్టూ అరటిపండ్లు, కూరగాయలు, ఇతర పంటలు వేసుకుని వాటినే ఆహారంగా తీసుకుంటున్నారు.

అభివృద్ధికి ఆమడ దూరం..

ఆదివాసీ గూడేలు అభివృద్ధికి ఆమడ దూరంలో మగ్గుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలైనా ఇంకా రోడ్లు, రవాణా సౌకర్యం లేదంటే అతిశయోక్తి కాదు. ఆదివాసీల ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఐటీడీఏ నేడు అనారోగ్యంతో మూలుగుతోంది. ప్రభుత్వాలు, పాలకులు మారిన తమ తలరాతలు మారడం లేదని ఆదివాసీ ప్రజలు పేర్కొంటున్నారు. కాగా, 1986లో ఏటూరునాగారంలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) కార్యాలయాన్ని స్థాపించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 13 ఏజెన్సీ మండలాలు, 177 షెడ్యూల్డ్‌ గ్రామాలుగా గుర్తించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లా ఐటీడీఏ వ్యాప్తంగా 1,86,607 మంది ఆదివాసీ జనాభా ఉంది.

పథకాలు అందని ద్రాక్ష..

ఐటీడీఏ పరిధిలో ఇంకా 30 వేల వరకు అటవీ హక్కు పత్రాలు కోసం ఆదివాసీలు ఎదురు చూస్తున్నారు. మాతా శిశు సంచార వైద్యశాల(వాహనాల) తొలగించడంతో గూడేలకు వాహనం వెళ్లడం లేదు. హార్టికల్చర్‌, అగ్రికల్చర్‌, మత్స్యశాఖ, పశుసంవర్థకశాఖ, మైనర్‌ ఇరిగేషన్‌ వంటి శాఖలు కనుమరుగయ్యాయి. గతంలో ఈ శాఖల ద్వారా ఆదివాసీలకు లబ్ధిచేకూరేది. ఇలా అనేక పథకాలు రోజు రోజుకూ కనుమరువుతున్నాయి.

ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ పరిధిలో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు పీఓ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బస్టాండ్‌ నుంచి వై జంక్షన్‌ వరకు ర్యాలీ, విగ్రహాలకు పూలమాలలు వేస్తామన్నారు. గిరిజన భవన్‌లో సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పీఓ పేర్కొన్నారు.

గొత్తికోయగూడేలకు మిషన్‌ భగీరథ పైపులైన్‌, ప్రభుత్వ చేతి పంపులు లేవు. దీంతో వర్షాకాలంలో వాగులు, తోగుల నీరు మురికిగా ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా వ ర్షం కురుస్తున్న సమయంలో బయట కర్రకు నాలుగు మూలలకు చీర కట్టి మధ్యలో రాయివేసి ఆ నీటిని బిందెలో నింపుకుంటారు. వాటిని తాగు నీటికి ఉపయోగించడం నానాటికీ కొనసాగుతోంది.

గొత్తిగోయ గూడేలకు ఇప్పటి వరకు విద్యుత్‌ సౌకర్యం లేదు. కేవలం దిగిటిలు, నెగల్లు పెట్టుకుని కారుచీకట్లలో కాలం వెళ్లదీస్తున్నారు. ములుగు జిల్లాలోని ఐదు మండలాల్లో 51 గొత్తికోయగూడేలు ఉన్నాయి. ఇందులో 3,154 మంది జనాభా ఉంది. వారికి సరైన రోడ్లు, పాఠశాలలు, అంగన్‌వాడీలు, పక్కా ఇళ్లు లేవు. తాత్కాలికంగా పెంకుటిల్లులు వేసుకుని జీవిస్తున్నారు. పాఠశాలలకు సరైన భవనం లేకపోడంతో మంత్రి సీతక్క కంటైనర్‌ పాఠశాలలు మంజూరు చేయించారు. అయితే మరికొన్ని గ్రామాల పాఠశాలలు పక్కా భవనం లేక గుడిసెల్లోనే కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా గుండెంగవాయి, మామిడిగూడెం వంటి గ్రామాలకు అంగన్‌వాడీ కేంద్రం లేకపోవడంతో పౌష్టికాహారం కోసం మూడు కిలోమీటర్ల మేర పిల్లలను ఎత్తుకుని సమీపంలోని బూటారం కేంద్రానికి కాలినడకన చేరుకోవాల్సి దుస్థితి నెలకొంది. ఆ గూడెంలోని 0–5 చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రం లేకపోవడంతో ఇంటి వద్దే ఉంటూ చాలీచాలని ఆహారం తీసుకుని రక్తహీనతకు లోనవుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం గొత్తికోయలకు అంగన్‌వాడీ కేంద్రం మంజూరు చేయడం లేదని ఆదివాసీలు పేర్కొంటున్నారు.

నేటికీ సంస్కృతి,

సంప్రదాయాల ఆచరణలోనే..

నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement