చిట్యాల: ప్రభుత్వానికి సకాలంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్ ) అప్పగించకుండా, ధాన్యాన్ని పక్కదారి పట్టించి రూ.4.38 కోట్ల నిధులను దుర్వినియోగం చేసిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గిద్దెముత్తారం గ్రామంలోని వైష్ణవి ఇండస్ట్రీస్ రైస్‌మిల్లులో చోటు చేసుకుంది. వివరాలి లా ఉన్నాయి. శుక్రవారం రాత్రి విజిలెన్స్, సివిల్ సప్లయీస్ అధికారులు తనిఖీలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యానికి మిల్లులో ఉన్న ధాన్యానికి భారీగా తేడా కనిపించింది. 2022–23 రబీలో 556.400 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. రూ.93,95,407 చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.55 లక్షలు మాత్రమే మిల్లు యజమాని చెల్లించాడు. అలాగే, 2025–26 ఖరీఫ్‌లో 4,218.080 మెట్రిక్ టన్నుల ధాన్యంలో 1,328.728 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ అప్పగించారు. మిగిలిన నిల్వలో 1251.434 మెట్రిక్ టన్నుల ధాన్యం బస్తాలు మిల్లులో లేవని తనిఖీలో వెల్లడైంది. 2025–26 రబీలో కేటాయించిన 850.680 మెట్రిక్ టన్నుల ధాన్యంలో 176.880 మెట్రిక్ టన్నుల ధాన్యం బస్తాలు తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2025–26 సంవత్సరానికి సంబంధిం మొత్తం 1,428.314 మెట్రిక్ టన్నుల ధాన్యం విలువ రూ. 3,99,92,792 కాగా.. పాత బకా యిలు రూ.38,95,407తో కలిపి మొత్తం రూ.4,38,88,199 ప్రభుత్వ సొమ్మును మిల్లు యజమాని యాంసాని సంతోష్ దుర్వినియోగం చేశాడని అధికారులు నిర్ధారించారు. దీంతో జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ రాములు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం మిల్లు యజమాని యాంసాని సంతోష్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసినుట్లు సీఐ మల్లేశ్ తెలిపారు. అనంతరం సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో విజిలెన్స్ సీఐ రాకేశ్, తహసీల్దార్ లక్ష్మణ్, పౌరసరఫరాల శా ఖ ఇన్‌స్పెక్టర్ రాజు, టెక్నికల్ అసిస్టెంట్స్ రాహుల్, అరవింద్ తదితరులు ఉన్నారు.
● వైష్ణవి ఇండస్ట్రీస్ రైస్‌మిల్లుపై అధికారులు దాడులు
● యజమానిపై కేసు నమోదు చేసిన చిట్యాల పోలీసులు


