కాశిబుగ్గ: తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ (థానా) 11వ వార్షిక రాష్ట్ర మహాసభ ‘థానాకాన్’–2026ను ఆదివారం ఉదయం 8 గంటలకు నిర్వహించనున్నారు. వరంగల్ ఐఎంఏ హాల్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు వార్షికోత్సవ వివరాలను వెల్లడించారు. ములుగురోడ్డులోని వజ్ర గార్డెన్స్‌లో జరిగే వార్షిక కాన్ఫరెన్స్ థానాకాన్‌కు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాల ప్రతినిధులు, వైద్యనిపుణులు, వైద్యులు, ఆరోగ్యరంగానికి చెందిన ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు. సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర దేవాదాయ , అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ కడియం కావ్య, పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. అలాగే, వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ప్రత్యేక అతిథిగా హాజరై ‘వైద్యుల కోసం సైబర్ భద్రత’ అంశంపై అవగాహన ఉపన్యాసం చేస్తారని వివరించారు. వరంగల్‌కు చెందిన నేత్ర వైద్య నిపుణుడు పి.ప్రవీణ్ 2026–27 సంవత్సరానికి థానా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించనున్నారు. సమావేశంలో థానా వరంగల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ముక్కా దిలీప్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ఎల్.నాగేశ్వర్‌రావు, కోశాధికారి వి.నరేశ్‌కుమార్, వద్దిరాజు రాకేశ్, ప్రవీణ్, రమేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాన్ఫరెన్స్‌కు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.


