మహబూబాబాద్ రూరల్ : ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాననే మనస్తాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మానుకోట టౌన్ సీఐ రఘుపతిరెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రావు కాలనీలో నివాసం ఉంటూ కూలి పని చేసుకుని జీవిస్తున్న కుంట రాకేష్ (23) రెండు సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరి ప్రేమ విషయంలో పలుమార్లు పెద్దల పంచాయతీలు ఘర్షణలు జరగ్గా అమ్మాయి తల్లిదండ్రులు ప్రేమను అంగీకరించలేదు. దీంతో రాకేష్ తండ్రి ఉప్పలయ్య అతడికి తొమ్మిది నెలల క్రితం వేరే అమ్మాయితో వివాహం జరిపించాడు. ఆషాడమాసం కావడంతో రాకేష్ భార్య తల్లిగారింటికి వెళ్లగా ఒంటరిగా ఉన్నాడు. ఈక్రమంలో గురువారం పండ్లు అమ్ముకునేందుకు వెళ్లిన తల్లిదండ్రులు భోజన సమయానికి ఇంటికి వచ్చి చూసేసరికి రాకేష్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారడు. రాకేష్ తండ్రి ఉప్పలయ్య ఫిర్యాదు మేరకు టౌన్ ఎస్సై సుదర్శన్ కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.
నెక్కొండ: తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెక్కొండ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామానికి చెందిన బత్తుల సాయిరాం (20) పదో తరగతిలో ఫెయిల్ అవ్వడంతో జులాయిగా తిరుగుతున్నాడు. నిత్యం సెల్ ఫోన్‌తో కాలక్షేపం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటి నిర్మాణ పనులకు సాయం కోరిన తల్లిదండ్రులకు సాయిరాం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీతో నిత్యం సెల్ ఫోన్‌తో కాలక్షేపం చేస్తావా.. అంటూ తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో మనస్తాపానికి గురైన సాయిరాం నిర్మాణంలో ఉన్న ఇంట్లో శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


