కురవి: తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడిన ఘటన మానుకోట జిల్లా సీరోలు మండలం తాళ్లసంకీస గ్రామంలో గురువారం చోటుచేసుకున్నట్లు శుక్రవారం సీరోలు ఎస్సై సంతోష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లసంకీస గ్రామంలో కొరిపెల్లి బాలకృష్ణ–స్వరూప దంపతులు నివాసం ఉంటున్నారు. ఈక్రమంలో గురువారం బాలకృష్ణ తన ఇంటికి తాళం వేసి మహబూబాబాద్‌లోని తన షాపునకు వెళ్లాడు. భార్య స్వరూప సీరోలు మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ స్కూల్‌లో విధులకు హాజరయ్యేందుకు వెళ్లింది. గురువారం సాయంత్రం బాలకృష్ణ ఇంటికి వచ్చి చూడగా.. ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో పరిశీలించగా.. రెండు ఇనుప బీరువాలు పగులగొట్టి బంగారు ఆభరణాలు, నగదు దొంగిలించినట్లు గుర్తించాడు. విషయం తెలుసుకున్న సీరోలు పోలీసులు క్లూస్ టీం సభ్యుల బృందంతో ఘటనస్థలాన్ని పరిశీలించారు. 14 తులాల బంగారు అభరణాలు, రూ.2.05లక్షలు అపహరించినట్లు ఎస్సై సంతోష్ తెలిపారు. ఈ విషయమై బాలకృష్ణ శుక్రవారం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
14 తులాల బంగారు ఆభరణాలు
రూ.2.05లక్షల నగదు అపహరణ


