మహబూబాబాద్: జిల్లాలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) సెంటర్ ఏర్పాటుకు అధికారులు రెండు నెలలుగా కసరత్తు చేస్తున్నారు. ముందుగా ప్రైవేట్ భవనాలు పరిశీలించగా అద్దె ఎక్కువగా ఉండడంతో వెనుకడుగు వేశారు. త్వారీత ప్రభుత్వ భవనాలను పరిశీలిస్తున్నారు. కాగా, టాస్క్ సెంటర్‌లో శిక్షణ కోసం నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు.
నిరుద్యోగుల్లో నైపుణ్యాభివృద్ధికి..
నిరుద్యోగ యువతలో నైపుణ్యాల అభివృద్ధితో పాటు ఉపాధి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు టాస్క్ సెంటర్ మంజూరు చేసింది. ఆర్గనైజేషన్ ద్వారా శిక్షణ ఇచ్చిన అనంతరం పలు కంపెనీలు ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పి స్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం హనుమకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో టాస్క్ సెంటర్లు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో టాస్క్ సెంటర్ ఏర్పాటు కోసం రీజినల్ మేనేజర్ సునీల్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమన్నారాయణరెడ్డి మానుకోట పట్టణంలోని తొర్రూరు రోడ్డు, ఈదులపూసపల్లి రోడ్డులో ప్రైవేట్ భవనాలతో పాటు ప్రభుత్వ డీగ్రీ కళాశాలను కూడా పరిశీలించారు. జిల్లా పరిశ్రమలశాఖ, ఉపాధి కల్పన శాఖ సమన్వయంతో ఆ సెంటర్ పనిచేస్తుంది. జిల్లా ఉపాధి కార్యాలయంలో ఇప్పటి వరకు 6,536 మంది ఎంప్లాయ్‌మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
మళ్లీ భవనాల పరిశీలన..
ఇటీవల మళ్లీ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు గదులను పరిశీలించారు. కానీ ఆ గదులకు బదులుగా అనుకూలంగా లేని వేరే రెండు గదులు ఇస్తామని చెప్పారు. అయితే టెక్నికల్ సమస్య వస్తుందని అధికారులు విముఖత వ్యక్తం చేశారు. కాగా, జిల్లా కేంద్రంలోని ఐటీఐ కాలేజీ, ఎస్పీ పాత కార్యాలయ భవనం, రెడ్యాలలోని ప్ర భుత్వ భవనాలను పరిశీలించారు. కాగా, ఎస్పీ కార్యాలయాన్ని నూతన భవనంలోకి మారిస్తే.. టాస్క్ సెంటర్‌ను పాత ఎస్పీ కార్యాలయంలో ఏ ర్పాటు చేయాలనే ఆలోచిస్తున్నట్లు అధికారులు పే ర్కొన్నారు. అయితే నేటి వరకు సెంటర్‌కు భవనం కేటాయింపు జరగలేదు.
రూ.30లక్షలు కేటాయింపు..
టాస్క్ సెంటర్‌లో ఫర్నిచర్, ఇతర మౌలిక వసతులకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. దీంతో కలెక్టర్ స్నేహశబరీష్ ఇతర గ్రాంట్ నుంచి రూ.30 లక్షలు కేటాయించి కంప్యూటర్లు, మెటీరియల్స్, ఫర్ని చర్ ఇతర ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు తెలి పారు. కలెక్టర్ సెంటర్ ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, అందుకోసం బడ్జెట్ కేటాయించారని అఽ దికారులు తెలిపారు. అయితే అనువైన భవనం లేక సెంటర్ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది.
కేంద్రంలో ఇచ్చే శిక్షణలు..
కేంద్రంలో మేనేజర్, ట్రైనర్ ఉంటారు. ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెంటర్ ఓపెన్ చేసి ఉంటుంది. వారం నుంచి ఆరు నెలలు వరకు వివిధ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తారు. బ్యాంకింగ్, ఐసెట్, నెట్ వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, డెటా అనాలిటిక్స్, మార్కెటింగ్, ఐటీ కోర్సు, కమ్యూనికేషన్స్, డిజిటల్ మార్కెటింగ్, ఎంఎస్ ఆఫీస్ డవలప్‌మెంట్, పరిశ్రమల అవసరాలు, తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. యువత నైపుణ్యాభివృద్ధే లక్ష్యంగా టాస్క్ పని చేస్తుంది.
ఇంటర్వ్యూల ద్వారా ఉపాధి..
టాస్క్ సెంటర్‌లో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్స్ ఇస్తారు. ఆతర్వాత పలు కంపెనీల ద్వారా ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయించి ఉద్యోగ అవకాశాలు వారే కల్పిస్తారు. ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. టాస్క్ సెంటర్లలో శిక్షణ పొంది ఉద్యోగాలు చేస్తున్న వారు చాలామంది ఉండడంతో.. సెంటర్‌కు మంచి స్పందన వస్తుంనది అధికారులు చెబుతున్నారు.
నెలాఖరు వరకు సెంటర్ ఏర్పాటు
ప్రభుత్వ భవనంలో సెంటర్ ఏర్పాటు చేయాలని చూస్తున్నాం. అందుకే ఆలస్యమవుతోంది. మిగితా ప్రాసెస్ అంతా పూరైంది. నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. వారికి సమాచారం ఇస్తున్నాం. యువత సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెలాఖరులోగా సెంటర్ ఏర్పాటు అవుతుంది.
– శ్రీమన్నారాయణరెడ్డి,
జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్
భవనాల పరిశీలనకే పరిమితం
రెండు నెలలుగా కసరత్తు చేస్తున్న అధికారులు
అనువైన ప్రభుత్వ భవనం లేకనే ఆలస్యం
శిక్షణకు 271 దరఖాస్తులు
ఇప్పటికే 271 మంది దరఖాస్తు
టాస్క్ సెంటర్‌లో శిక్షణ పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలియజేశారు. అందుకోసం గూగుల్ లింక్ ఏర్పాటు చేశారు. కాగా, ఈనెల 6వ తేదీ వరకు 271మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వారంతా సెంటర్ ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్నారు. సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.


