వీసీలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
మహబూబాబాద్: రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్‌లతో వ్యవసాయం, తదితర అంశాలపై సమీక్షించారు. ఈసందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. పంటల సాగుపై ప్రతీ రైతుకు స్పష్టమైన సందేశం చేరేలా అధికారులు పని చేయాలన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 99,81,167 ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్లు చెప్పారు. వీసీలో కలెక్టర్ స్నేహశబరీష్, అదనపు ఇన్‌చార్జ్ కలెక్టర్ పురుషోత్తం, అధికారులు పాల్గొన్నారు.
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
కురవి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్పీ శబరీష్ ఆదేశించారు. శుక్రవారం సీరోలు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ పనితీరు, రికార్డులు, పోలీసింగ్ విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు. స్టేషన్‌లోని వివిధ రికార్డులు, పెండింగ్‌లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల దర్యాప్తు పురోగతి, సీసీటీఎన్‌ఎస్ నిర్వహణ, డయల్–112 కాల్స్‌పై స్పందన, గ్రామాల సందర్శన వివరాలు, గంజాయి ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన సమాచార సేకరణ, గ్రామస్థాయిలో వీపీఓ వ్యవస్థ పనితీరు, స్టేషన్ సిబ్బంది, రౌడీ షీటర్లు, అనుమానితుల వివరాలు, నేరాల పరిస్థితి తదితర అంశాలపై సమీక్షించారు. సీసీటీఎన్‌ఎస్‌లో కేసుల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. డయల్–112 ద్వారా వచ్చే ప్రతీ ఫిర్యాదుపై తక్షణమే స్పందించాలన్నారు. గ్రామాల సందర్శనను నిరంతరం కొనసాగిస్తూ గ్రామస్తులతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలన్నారు. గంజా యి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. వీపీఓ వ్యవస్థను గ్రామస్థాయిలో సమర్థవంతంగా వినియోగించి నేరాల నియంత్రణ, సైబర్ నేరాలపై అవగాహన, శాంతిభద్రతల పరిరక్షణలో కీలకపాత్ర పోషించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టేషన్ సిబ్బందితో సమావేశమై విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిజాయితీ, ప్రజలతో మర్యాదపూర్వక వైఖరి, బాధ్యతాయుత సేవాభావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ కృష్ణకిశోర్, మరిపెడ సీఐ పవన్, సీరోలు ఎస్సై సంతోష్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
నెల్లికుదురు: మోడల్ స్కూల్ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని మోడల్ స్కూళ్ల ప్రత్యేక అధికారి సాయిశ్రీ అన్నారు. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌ను శుక్రవారం ప్రత్యేక అధికారి సందర్శించారు. స్కూల్, కళాశాల, హాస్టల్‌ను పరిశీలించారు. హాస్టల్ విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు, కేర్‌టేకర్ అనిత పాల్గొన్నారు.
ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
కేయూ క్యాంపస్: విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కేయూ ఓఎస్‌డీ ప్రొఫెసర్ బి.వెంకట్రాంరెడ్డి సూచించారు. కేయూ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థినులకు శుక్రవారం ఓరియంటేషన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. అధ్యాపకుల మార్గదర్శకత్వం, ఇంటర్నెట్, ఏఐ, ఆన్‌లైన్ వీడియో లెక్చర్లు, డిజిటల్ లెర్నింగ్ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. నిట్ ప్రొఫెసర్ బి.స్ఫూర్తి మాట్లాడుతూ.. కళాశాల జీవితం విద్యార్థినుల వ్యక్తిత్వ వికాసానికి అత్యంత కీలకమైన దశ అని అన్నారు. కేయూ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కె.భిక్షాలు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కళాశాల కల్పిస్తున్న సదుపాయాలు, అకడమిక్ కార్యక్రమాలు, సహపాఠ్య కార్యక్రమాల గురించి వివరించారు. ఈనెల 11 నుంచి 16 వరకు నూతన విద్యార్థినులకు ఇండక్షన్ ప్రోగ్రాం గురించి కన్వీనర్ ఎస్.సాహితి, సహ కన్వీనర్ టి.వెంకటేశ్, ఇన్‌చార్జ్ డాక్టర్ శ్రీరామ్‌జ్యోత్స్న తెలిపారు.


