మహబూబాబాద్ రూరల్ : ఆరుతడి, కూరగాయల పంటల సాగు మేలుదాయకమని, మహిళా సంఘాల సహకారంతో కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయంలో సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మరియన్న మాట్లాడుతూ.. జిల్లాలో 4వేల ఎకరాల్లో కూరగాయలు సాగు విస్తీర్ణానికి ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 524 ఎకరాల్లో మహిళా స్వయం సహాయ సంఘాల ద్వారా, వ్యవసాయ అధికారుల సహకారంతో కూరగాయలు సాగు చేపట్టినట్లు చెప్పారు. టమాట, వంగ, పచ్చిమిర్చి, బీర, సోర, కాకర, బోడ కాకర, బెండ, చిక్కుడు, ఆకుకూరలు సాగు చేస్తున్నారన్నారు. రైతులు ఆధునిక పద్ధతులు పాటించి సేంద్రియ వ్యవసాయం చేయాలన్నారు. రైతులు కూరగాయల పంటలు సాగుచేసే విధంగా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఐకేపీ డీపీఎం శ్రీకాంత్, ఉద్యాన అధికారులు శాంతిప్రియదర్శిని, స్రవంతి, సిబ్బంది జ్యోత్స్న, సుకన్య, రామకృష్ణ ఉన్నారు.


