నర్సంపేట రూరల్ : ఒడిశా నుంచి హైదరాబాద్ తరలిస్తున్న 28 కేజీల గంజాయిని పట్టుకుని ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం నర్సంపేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్ల డించారు. ఈనెల 05వ తేదీన ఒడిశాకు చెందిన బోలెరో వాహనంలో భద్రాచలం, మహబూబాబాద్, నర్సంపేట మీదుగా హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఎస్సై గూడ అరుణ్, సిబ్బంది నర్సంపేట పట్టణంలోని మహబూబాబాద్ బైపాస్ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఇందులో ముగ్గురు వ్యక్తులు వాహనాన్ని నిలిపి పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురులో ఒకరు పరారు కాగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని తనిఖీ చేశారు. ఇందులో వాహనం కింది భాగంలో సుమారు రూ. 14లక్షల విలువైన 28 కేజీల గంజాయి లభ్యమైంది. దీంతో వెంటనే గంజాయితోపాటు వాహనాన్ని సీజ్ చేసి నర్సంపేట తహసీల్దార్ రవిచంద్ర ఆధ్వర్యంలో పంచానామా నిర్వహించి, కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన అమృత బైద్యాయ్, పుజూర్ రాయ్ ఉన్నారు. కాగా, గంజాయిని పట్టుకున్న ఎస్సై అరుణ్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.
మరిపెడలో 2.24 కిలోలు స్వాధీనం..
ఐదుగురి అరెస్ట్
మరిపెడ రూరల్: ఒడిశా నుంచి నల్లగొండ జిల్లాకు గంజాయి తరలిస్తున్న ఐదుగురు యువకుల గల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 1.12 లక్షల విలువైన 2.240 కిలోల సరుకు, కారు, 4 సెల్ ఫోన్లు, రూ.1,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు మరిపెడ సీఐ ఎల్.పవన్ కుమార్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం మరిపెడ ఎస్సై సతీశ్, సిబ్బంది రవీందర్, రమేశ్, వెంకన్న, మహిళా కానిస్టేబుల్ శాంత మండలంలోని పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో వేగంగా వచ్చిన ఓ కారును పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా, అందులో ఉన్న వారు తప్పించుకోవడానికి యత్నించారు. అప్రమత్తమైన పోలీ సులు కారును నిలిపి తనిఖీ చేశారు. ఇందులో డ్రైవ ర్ సీటు కింద 2 కిలోల 240 గ్రాముల ఎండు గంజాయి లభించింది. దీంతో నల్లగొండ జిల్లా కనగల్ గ్రామానికి చెందిన గండికోట వంశీ, చిత్రం రాకేశ్, చింతల తిరుమలేశ్, కంచి మహేశ్, మాదాసు మ హేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నల్లగొండలో సెల్ఫ్ డ్రైవ్‌కు కారును అద్దెకు తీసుకుని ఒడిశాకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి నల్లగొండలో విక్రయించేందుకు వస్తున్నట్లు నిందితులు నేరం ఒప్పుకున్నారు. దీంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
ఇద్దరి అరెస్ట్, రిమాండ్
వివరాలు వెల్లడించిన పోలీసులు


