‘మన’ స్ఫూర్తి.. ఘన ‘కీర్తి’ | - | Sakshi
Sakshi News home page

‘మన’ స్ఫూర్తి.. ఘన ‘కీర్తి’

Aug 7 2026 1:38 AM | Updated on Aug 7 2026 1:38 AM

ఎంఐటీలో ప్రతిష్టాత్మక హంఫ్రీ ఫెలోషిప్‌నకు జనగామ జిల్లాకు చెందిన ఐఏఎస్‌ ఎంపిక

జనగామ : జనగామ జిల్లా తరిగొప్పుల వాసి, ఐఏఎస్‌ అధికారి జల్లి కీర్తి అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)లో నిర్వహించే ప్రతిష్టాత్మక హ్యూబర్ట్‌ హెచ్‌.హంఫ్రీ ఫెలోషిప్‌ కార్యక్రమానికి ఎంపికయ్యారు. అసోం, మేఘాలయ కేడర్‌కు చెందిన 2013 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిగా ఆమె ప్రస్తుతం అసోంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2026 ఆగస్టు నుంచి 10 నెలల పాటు సాగే ఈ ఫెలోషిప్‌లో కీర్తి జల్లి ‘టెక్నాలజీ పాలసీ అండ్‌ మేనేజ్‌మెంట్‌’ అనే అంశంపై ఉన్నత స్థాయి అధ్యయనం, పరిశోధన, విధానపరమైన శిక్షణ పొందనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాపాలన రంగంలోని మధ్యస్థాయి నాయకులను తీర్చిదిద్దే అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది.

కర్మశ్రీ అవార్డుతో సన్మానం..

కీర్తి జల్లి హైదరాబాద్‌లో విద్యాభ్యాసం చేసి సివిల్‌ సర్వీస్‌ సాధించారు. రైతు కుటుంబంలో జన్మించిన ఆమె తండ్రి తెలంగాణ హైకోర్టులో సీనియర్‌ అడ్వకేట్‌గా, తల్లి గృహిణిగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె అసోంలో పంచాయతీ, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌తోపాటు స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (గ్రామీణ) డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కోవిడ్‌–19 నియంత్రణ, వరద సహాయక చర్యల్లో చూపిన నాయకత్వానికి అసోం ప్రభుత్వం ఆమెను కర్మశ్రీ అవార్డుతో సన్మానించింది. ప్రభుత్వ సేవల్లో సాంకేతికత వినియోగం, డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌్‌ఫ్రాస్ట్రక్చర్‌, డేటా ఆధారిత పరిపాలనపై ఈ ఫెలోషిప్‌లో కీర్తి ప్రత్యేక అధ్యయనం చేయనున్నారు. ఎంఐటీ వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలో అధ్యయనం చేసే అవకాశాన్ని దక్కించుకోవడం తెలంగాణకు గర్వకారణమని పలువురు న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement