మహబూబాబాద్ రూరల్: సికింద్రాబాద్ రైల్ నిలయంలో రైల్వే శాఖ ఉన్నత అధికారులు సుదర్శన్ శర్మ, మురళీకృష్ణను మానుకోట ఎమ్మెల్యే మురళీనాయక్ బుధవారం కలిశారు. అత్యంత కీలకమైన రైల్వే మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో, రైల్వే 4వ లైన్ నిర్మాణ పనులు, మానుకోట ఎల్సీ–80 గేటు వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు పలు అంశాలపై వారితో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటుౖకు ఇప్పటి వరకు దాదాపు 90 శాతం ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు తెలిపారన్నారు. ప్రస్తుతం డీపీఆర్ సిద్ధం చేసి పంపాల్సి ఉందని, అనంతరం టెండర్ పూర్తి చేసి నిర్మాణ పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే రైల్వే 4వ లైన్ నిర్మాణంలో భాగంగా ఎల్సీ 80 వద్ద రైల్వే పాతబజారు, కొత్తబజారు ప్రాంతాలతో పాటు మహబూబాబాద్ పట్టణ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అండర్ బ్రిడ్జి నిర్మాణం అత్యవసరమని అధికారులకు వివరించామని చె ప్పారు. అండర్ బ్రిడ్జి నిర్మించాలని కోరామని, ఈమేరకు రైల్వే అధికారులు ఎల్సీ 80 గేటు వద్ద అండర్ బ్రిడ్జి ప్రతిపాదనను కూడా ప్రాజెక్టులో భాగంగా చేరుస్తామని తెలిపినట్లు ఎమ్మెల్యే వివరించారు.
రైల్వే ఉన్నత అధికారులను కలిసిన ఎమ్మెల్యే మురళీనాయక్


