● ఆగి ఉన్న కారును ఢీకొన్న బైక్
● కానిస్టేబుల్ దుర్మరణం
రఘునాథపల్లి: కారు సడన్ బ్రేక్ ఓ కానిస్టేబు ల్ ప్రాణం తీసింది. ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక బైక్‌పై వస్తూ ఓ కానిస్టేబుల్ ఢీకొని దుర్మరణం చెందాడు. ఈ ఘటన బుధవారం హనుమకొండ– హైదరాబాద్ జాతీయ రహదారిలోని కోమళ్ల టోల్ ప్లాజా సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలం కునూరు గ్రామానికి చెందిన పారుపల్లి ధనుంజయ (43) హనుమకొండ జిల్లా హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. రఘునాథపల్లిలో జరిగిన ఓ ఫంక్షన్‌కు బైక్‌పై హాజరయ్యాడు. మధ్యాహ్నం తిరిగి విధులకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కోమళ్ల టోల్ ప్లాజా సమీపం మలుపు వద్ద ముందు వెళ్తున్న కారును డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి రహదారిపై నిలిపాడు. వెనుక ఉన్న ధనుంజయ కారును ఢీకొన్నాడు. దీంతో రోడ్డుపై ఎగిరి పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. హెల్మెట్ ధరించి ఉన్నా స్టిప్ తెగి పోవడంతో తల నుంచి ఎగిరిపోయింది. స్థానికులు గుర్తించి వెంటనే జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరిక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య దీప, కుమారుడు కార్తీక్, కూతురు ఉన్నారు. మృతుడి కుమారుడు కార్తీక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.


