శామీర్‌పేట బైపాస్ వద్ద అదుపులోకి..
జనగామ: లింగనిర్ధారణ కేసులో స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ భీంశర్మ వెల్ల డించారు. బుధవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సీఐ సత్యనారాయణరెడ్డితో కలిసి ఏసీపీ విలేకరులతో మాట్లాడారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి ఫీర్జాదిగూడకు చెందిన అంబాల భాస్కర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో జనగామ జిల్లా చిల్పూరు మండలం మల్కాపురం గ్రామానికి చెందిన (ప్రస్తుతం హనుమకొండ గోపాలపూర్ నివాసి) ల్యాబ్‌టెక్నీషియన్ ప్రవీణ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ప్రాథమిక విచారణలో నిందితుడు అంగీకరించినట్లు పేర్కొన్నారు. వివిధ జిల్లాలకు చెందిన కొందరు ఆర్‌ఎంపీలు, మధ్యవర్తుల ద్వారా గర్భిణులను ప్రవీణ్ వద్దకు పంపించగా.. ఒక్కోకేసుకు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేసినట్లు వెల్లడైందన్నారు. ఇదే తరహా కేసుల్లో గతంలోనూ అతడు నిందితుడిగా ఉన్నట్లు తేలిందన్నారు. 2021, 2023లో పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో మొత్తం ఐదు కేసులు నమోదై, వాటిలో అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఆ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా సేకరిస్తున్నట్లు చెప్పారు.
జనగామ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఈ కేసును పోలీస్ కమిషనర్ శ్వేత సూచన మేరకు వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ భీంశర్మ పర్యవేక్షణలో సీఐ సత్యనారాయణరెడ్డి బృందం దర్యాప్తు చేపట్టింది. బుధవారం జనగామ మండలం శామీర్‌పేట బైపాస్ వద్ద సీఐ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేస్తుండగా నిందితుడు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిపారు. ప్రస్తుతం మరో 12 నుంచి 15 మంది వరకు ఈ వ్యవహారంలో భాగస్వాములై ఉండే అవకాశం ఉందని భావిస్తున్నామని, వారిని కూడా గుర్తించి అరెస్ట్ చేస్తామని ఏసీపీ స్పష్టం చేశారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన సీఐ, ఎస్సై భరత్, కానిస్టేబుళ్లు కరుణాకర్, సాగర్, కృష్ణ, భాస్కర్‌ను పోలీస్ కమిషనర్ అభినందించినట్లు ఏసీపీ వెల్లడించారు. నిందితుడు ప్రవీణ్ నుంచి రెండు అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాలు, కారు, రెండు ఫోన్లు, రూ.15వేల నగదు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సై నర్సయ్య ఉన్నారు.
మరో 12 నుంచి 15 మంది
పాత్రపై దర్యాప్తు
ఏసీపీ భీంశర్మ


