అవగాహన కల్పించాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత
వరంగల్ క్రైం : విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. ‘సురక్షా కా తిరంగా’ కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం బాలసముద్రంలోని కాళోజీ కళా క్షేత్రంలో సైబర్ నేరాలపై ప్రభుత్వ పాఠాశాల ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఎంతో సైబర్ మంది నేరగాళ్లు ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి ఘటనలు వింటున్నా, సైబర్ నేరాలపై అవగాహన ఉన్నా ప్రజలు మోసపోతూనే ఉన్నారన్నారు. ఇందుకు ప్రధానంగా అత్యాశే కారణమన్నారు. దీంతోపాటు భయం, అత్యవసరం లాంటి కారణాలతో సైబర్ మోసాల బారిన పడుతున్నారన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లు, ఫొటోలపై క్లిక్ చేయడం ప్రమాదమన్నారు. అలాగే, పిల్లలకు ప్రైవేట్ లైఫ్, పబ్లిక్ లైఫ్‌పై అవగాహన కల్పించాలన్నారు. ఎంతో మంది తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు, సమాచారాన్ని సోషల్ మీడియాల ద్వారా పంచుకోవడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయన్నారు. అనంతరం సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, విద్యాశాఖ సీఎంఓ సుమ, హనుమకొండ, సైబర్ క్రైం, ఎస్‌బీ ఏసీపీలు నర్సింహరావు, వెంకటరమణ, జాన్ నర్సింహులు, ఇన్‌న్‌స్పెక్టర్లు రంజిత్, శివకుమార్, రవికుమార్,అశోక్, ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


