మహబూబాబాద్ అర్బన్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ చదువు మధ్యలో నిలిపేసిన విద్యార్థులకు, ఉద్యోగులకు, గృహిణిలకు తిరిగి విద్యను కొనసాగించేందుకు ఒక సువర్ణవకాశమని డీఈఓ ఏ. సత్యనారాయణమూర్తి అన్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో మంగళవారం 2026–27 విద్యా సంవత్సరం ఓపెన్ స్కూల్స్ ప్రవేశాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, జిల్లాలో ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు, మండల విద్యాధికారులు, గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులు తమ పరిధిలో బడిమానివేసిన వారికి అవగాహన కల్పించాలన్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. తెలంగాణ ఓపెన్ స్కూల్.ఓఆర్‌జీ అనే వెబ్‌సైట్‌లో అడ్మిషన్ పొందవచ్చన్నారు. ఈ నెల 17వ తేదీ వరకు ఎలాంటి రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు రూ.50 లేటు ఫీజుతో చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీజీఈ మందుల శ్రీరాములు, అధికారులు శంకర్, గాయత్రి, సతీష్, శ్రీకాంత్, శ్రీనివాస్, ఎంఈఓలు లచ్చిరాంనాయక్, బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ సత్యనారాయణమూర్తి


