హన్మకొండ: ‘ముందే చెప్పాను కదా... ఆర్టీసీ ఆస్తులు చూస్తానని. ఇక్కడ మూడు డిపోలు ఉన్నాయని ఎందుకు చెప్పలేదు... బస్టాండ్‌కు వచ్చిన తర్వాత హనుమకొండ చౌరస్తాలో ఆర్టీసీ స్థలం ఉందని తీసుకెళ్లారు.. ఏమనుకుంటున్నావు... సస్పెండ్ చేస్తా’ అంటూ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి.. ఆర్‌ఎం భవానీప్రసాద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై చర్య తీసుకోవాలని ఈడీ సోలోమన్‌కు సూచించారు. టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ యారం నాగిరెడ్డి మంగళవారం వరంగల్ రీజియన్ తనిఖీలో భాగంగా ఈడీలు సోలమన్, రాజశేఖర్, వరంగల్ ఆర్‌ఎం భవానీప్రసాద్‌తో కలిసి ముందుగా వరంగల్ బస్ స్టేషన్ నిర్మాణ స్థలానికి చేరుకుని పరిశీలించారు. పనులు జాప్యం కావడంతో ‘కుడా’ అధికారులు, కాంట్రాక్టర్‌పై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన ‘కుడా’ అధికారులు ఏప్రిల్ వరకు గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం హనుమకొండ చౌరస్తా బస్టాండ్‌ను పరిశీలించారు. రీజియన్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఇక్కడి నుంచి హనుమకొండ బస్ స్టేషన్‌కు చేరుకున్న ఆర్టీసీ ఎండీ.. నేరుగా వరంగల్–2 డిపోనకు చేరుకున్నారు. డిపోలో వ్యర్థాలు, ప్లాస్టిక్ బాటిళ్లు పేరుకు పోవడాన్ని చూసి జనావా సాల మధ్య వ్యర్థాలు ఇలా ఉంటే ఎలా అని డిపో మేనేజర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్–1 డిపోనకు చేరుకుని పరిశీలించారు. డిపోలో స్క్రాప్ చూసి డీఎంపై అసహనం వ్యక్తం చేశారు. స్క్రాప్ భారీగా పోగవడమేమిటని ప్రశ్నించారు. సెల్‌ఫోన్‌లో స్వయంగా ఫొటోలు, వీడియో తీసుకున్నారు. గ్యారేజీని, డిపో పరిసరాలను పరిశీలించారు. ఇక్కడి నుంచి హనుమకొండ బస్ స్టేషన్‌కు చేరుకుని పరిశీలించారు. రోడ్డుకు దిగువగా ఉండడం ఏమిటి సీనియర్ అధికారులున్నారు.. బ్రెయిన్ పెట్టి పని చేయలేదు... అందుకే వరద నీరు బస్టాండ్‌లోకి వస్తుందని కరీంనగర్ ఈడీ సోలమన్‌ను ప్రశ్నించారు. ఇక్కడి నుంచి హనుమకొండ రాంనగర్‌లోని హనుమకొండ డిపోనకు చేరుకుని పరిశీలించారు. ఈ డిపోలో రవాణ శాఖ అధికారుల తనిఖీలో పట్టుబడిన వాహనాలు అపరిశుభ్రంగా ఉండడం చూసి అసహనం వ్యక్తం చేశారు. వెంటనే వాహనాలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని డిపో మేనేజర్‌ను ఆదేశించారు. ఈ క్రమంలో బస్ డిపో ఎదురుగా నిర్మిస్తున్న భవనాన్ని చూసి ఇది ఎక్కడిదని ప్రశ్నించగా ఆర్టీసీ క్వార్టర్స్ స్థలమని, లీజ్‌కు ఇచ్చామని డిపో మేనేజర్ ధరంసింగ్ చెప్పగా, ఇంతకు ముందు ఎవరో ప్రైవేట్ వ్యక్తులదని చెప్పారని అంటూ సెల్ ఫోన్‌లో ఫొటో, వీడియో తీసుకున్నారు. ఇక్కడి నుంచి వరంగల్ ములుగు రోడ్‌లోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీకి చేరుకుని పరిశీలించారు. వరంగల్ నగరానికి కేటాయించిన 100 విద్యుత్ బస్సులు వస్తున్న క్రమంలో ప్రతిపాదిత డిపో ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. అనంతరం నేరుగా హనుమకొండలోని వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయానికి చేరుకుని 9 డిపో మేనేజర్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిపో వారీగా ప్రగతిని సమీక్షించారు. సీ సీఈ కవిత, విజిలెన్స్ ఆఫీసర్ బాబురావు, డిప్యూటీ ఆర్‌ఎంలు శ్రీహర్ష, కిషన్ రావు, డిపో మేనేజర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏప్రిల్ వరకు వరంగల్ జిల్లా బస్ స్టేషన్ నిర్మాణం పూర్తవుతుందని ఆర్టీసీ వరంగల్ ఎండీ వై.నాగిరెడ్డి చెప్పారు.
అసంపూర్తి సమాచారంపై ఆర్‌ఎంపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఆగ్రహం
వరంగల్ బస్‌స్టేషన్ పనుల తనిఖీ, హనుమకొండ బస్‌స్టేషన్ ఆవరణ, డిపోల పరిశీలన


