అన్ని ఎరువులకు ఒకే యాప్‌ | - | Sakshi
Sakshi News home page

అన్ని ఎరువులకు ఒకే యాప్‌

Aug 4 2026 12:53 AM | Updated on Aug 4 2026 12:53 AM

ఏజెన్సీ రైతులపై ప్రభావం..

జనగామ/సంగెం/ కొత్తగూడ: రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల పంపిణీ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు కేవలం యూరియాను మాత్రమే యాప్‌ ద్వారా పంపిణీ చేస్తుండగా ఇక నుంచి అన్ని రకాల కాంప్లెక్స్‌ ఎరువులకూ వర్తింపజేయడానికి కేంద్రం కొత్త యాప్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ ఫర్టిలైజర్‌ సేల్‌ (ఎఫ్‌ఎఫ్‌ఎస్‌)ను తీసుకొస్తుంది. ఎరువుల కొరత, బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరికట్టడంతోపాటు రైతులు క్యూలో నిలబడే ఇబ్బందులను తప్పించేలా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎరువుల కొనుగోళ్లకు డిజిటల్‌ విధానంలో ఎరువులను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేందుకు మరో కొత్త యాప్‌ రైతుల ముందుకు రానుంది. ఇప్పటివరకు యూరియా బుకింగ్‌ కోసం వినియోగిస్తున్న ‘ఫెర్టిలైజర్‌ బుకింగ్‌ యాప్‌’ స్థానంలో ‘ప్రేమ్‌వర్క్‌ ఫెర్టిలైజర్‌ సేల్‌’ (ఎఫ్‌ఎఫ్‌ఎస్‌)అనే పేరుతో యాప్‌ను తీసుకోస్తున్నారు. ఇప్పటివరకు ఉపయోగించిన యాప్‌ స్థానంలో మరో కొత్త యాప్‌ అమల్లోకి రానుండడంతో క్షేత్రస్థాయిలో రైతులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా యూరియాతో పాటుగా రైతుకు అవసరమైన డీఏపీ, పోటాస్‌, 20–20–0–13, 28–28–0, 14–35–14, 15–15–15, 16–16–16 వంటి ఇతర కాంప్లెక్స్‌ ఎరువులన్ని బుకింగ్‌ చేసుకుని కొనుగోలు చేసే విధంగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ అవకాశం కల్పిస్తున్నది. ఒకే కేంద్రంలో అన్ని రకాల ఎరువులు అందుబాటులో లేకపోతే వేర్వేరు ఎరువులకు వేర్వేరు డీలర్లను ఎంపిక చేసుకునే సౌకర్యాన్ని కూడా యాప్‌లో కల్పించారు. కొత్త యాప్‌ ద్వారా ఎరువులు పొందాలంటే ప్రతీ రైతు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ లేదా ఆధార్‌ నంబర్‌కు లింక్‌ అయిన ఫోన్‌నంబర్‌ తప్పనిసరిగా ఉండాలి. లేకుంటే ఎరువులు బుక్‌ చేసుకునే అవకాశం ఉండదు.

భూమి ధ్రువీకరణతో..

ఎరువుల కొనుగోలు సులభం చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌ కలిగిన ప్రతీ ఒక్కరు ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆపై భూమి విస్తీర్ణాన్ని ధ్రువీకరించుకుని రైతు ఆధార్‌ నంబర్‌గాని, రైతు రిజిస్ట్రేషన్‌ నంబర్‌ గాని నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. ఆతర్వాత రైతుకు ఉన్న భూమి సర్వే నంబర్లవారీగా కనిపిస్తుంది. ఆయా సర్వేనంబర్లలో ఏ పంటను సాగుచేశారో నమోదు చేయాలి. ఎరువు, పరిమాణం నమోదు చేయాలి. తనకు అవసరం ఉన్న ఎరువు ఏ రిటైలర్‌ షాపులో ఉన్నవో ఎంచుకోవాలి. రైతు స్వయంగానా లేదా మరోకరికోసమా ధ్రువీకరించాలి. సంప్రదింపుల కోసం ఫోన్‌ నంబర్‌ను నమోదు చేయాలి అపుడు క్యూ ఆర్‌ కోడ్‌ వస్తుంది. ఆ క్యూఆర్‌ కోడ్‌ను తీసుకుని ఎంచుకున్న రిటైలర్‌ వద్దకు వెళ్లి ఎరువులు తీసుకోవాల్సి ఉంటుంది.

ఉమ్మడి వరంగల్‌లో

సాగు లక్ష్యం (ఎకరాల్లో)

జిల్లా సీజన్‌ లక్ష్యం

హనుమకొండ 2,38,964

వరంగల్‌ 2,81,943

జనగామ 3,59,281

మహబూబాబాద్‌ 3,71,318

ములుగు 1,29,824

జేఎస్‌. భూపాలపల్లి 2,11,670

మొత్తం 15,93,000

కొత్తగా రూపొందించిన

కేంద్ర ప్రభుత్వం

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా

అధికారులకు శిక్షణ

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే యాప్‌ ఏజెన్సీ రైతులకు శాపంగా మారనుందా అనే చర్చ జరుగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన యూరియా యాప్‌లో పట్టా, హక్కు పత్రాలు ఉంటే వాటి నంబర్‌ ఆధారంగా.. అలాగే ఎలాంటి ఆధారాలు లేని రైతులకు వ్యవసాయాధికారుల ధ్రువీకరణతో ఆధార్‌ నంబర్‌ ద్వారా యూరియా బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన యాప్‌లో అలాంటి వెసులుబాటు లేదు. భూమి రికార్డులు తప్పనిసరి చేసింది. ఇలా అయితే ములుగు, మహబూబాబాద్‌, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లోని ఏజెన్సీ మండలాల రైతులకు శాపంగా మారనుంది. ఇక్కడి చాలామంది గిరిజన రైతులకు పూర్తిస్థాయిలో హక్కు పత్రాలు లేవు. ఇక గిరిజనేతర రైతులకు అసలే రికార్డులు ఉండవు. వీరి వ్యవసాయానికి ఎరువులు ఎలా వస్తాయి. ఇదిలా ఉంటే ఇక్కడి గ్రామాల్లో సెల్‌ సిగ్నల్స్‌ ఉండవు. చాలా మంది రైతులకు సెల్‌ఫోన్‌ వినియోగించడమే రాదు. వారు ఎరువులు ఎలా బుక్‌ చేసుకోవాలి.. వ్యవసాయం ఎప్పుడు చేసుకోవాలి అంటూ చర్చ సాగుతోంది.

ప్రారంభ దశలోనే ఉంది..

యాప్‌ ప్రారంభ దశలో ఉంది. కొన్ని జిల్లాలను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అక్కడ వస్తున్న సమస్యలకు అనుగుణంగా మార్పులు చేర్పులు ఉంటాయి. రైతులు ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎరువులు దుర్వినియోగం జరగకుండా కేవలం వ్యవసాయ రంగానికి మాత్రమే అందించేందుకు ప్రభుత్వం యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది.

– విజయచంద్ర, డీఏఓ మానుకోట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement