లారీ డ్రైవర్‌కు జైలుశిక్ష | - | Sakshi
Sakshi News home page

లారీ డ్రైవర్‌కు జైలుశిక్ష

Aug 4 2026 12:53 AM | Updated on Aug 4 2026 12:53 AM

వరంగల్‌ లీగల్‌ : అజాగ్రత్తగా అతివేగంతో లారీ నడిపి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ఇరువురి మృతికి కారణమైన లారీ డ్రైవర్‌ టి.వెంకన్నకు సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ హనుమకొండ రెండో మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ కోర్డు జడ్జి బి.అనూష సోమవారం తీర్పు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని లష్కర్‌సింగారం ప్రాంతానికి చెందిన మునిగాల విజయ్‌కుమార్‌ తన సోదని శ్వేతతో కలిసి 2016 అక్టోబర్‌ 16న ద్విచక్ర వాహనంపై హనుమకొండ నుంచి దేశాయిపేటకు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో ములుగు రోడ్డు జంక్షన్‌ వద్ద వరంగల్‌ వైపు నుంచి అతివేగంతో వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో విజయ్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. శ్వేత చికిత్స పొందుతూ మరుసటి రోజు ఆస్పత్రిలో మరణించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం సీతామియ తండాకు చెందిన లారీ డ్రైవర్‌ టి.వెంకన్నను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో నేరం రుజువుకావడంతో లారీ డ్రైవర్‌కు సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ జడ్జి అనూష తీర్పు వెల్లడించారు.

నా కుమారుడి మృతిపై అనుమానాలు

పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి

కాశిబుగ్గ : హత్యకేసులో నిందితుడిగా ఉన్న వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన జంగం వెంకన్న అలియాస్‌ వెంకటేష్‌ (35) మహబూబాబాద్‌ సబ్‌జైలులో అనారోగ్యంతో చనిపోయాడని చెబుతున్నది అబద్ధమని, తనకు అనుమానాలు ఉన్నాయని అతని తల్లి మైసమ్మ మంగళవారం గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంకటేశ్‌ నగరంలోని కాశిబుగ్గలో పనిచేస్తుండగా గత నెల 31న గూడూరు పోలీసులు వచ్చి పాత కేసు విషయం ఉందని చెబుతూ తీసుకెళ్లారని తెలిపింది. మహబూబాబాద్‌లోని సబ్‌ జైలుకు తీసుకెళ్లిన తర్వాత ఈనెల 1న జైలులో నొప్పి రావడంతో స్థానికంగా చికిత్స చేయించి, ఎంజీఎంకు తీసుకొచ్చి, 2న చనిపోయాడని పోలీసులు చెప్పారని పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉన్న కుమారుడు 24 గంటల వ్యవధిలో ఎలా చనిపోతాడని, దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని పేర్కొంది. కాగా ఇతని మృతిపై అనుమానాలు వ్యక్తం చేయడంతో మహబూబాబాద్‌ ఆర్డీఓ కృష్ణవేణి వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే వరంగల్‌, సిద్దిపేట, నర్సంపేటకు చెందిన ముగ్గురు ఫొరెన్సికల్‌ ప్రొఫెసర్ల సమక్షంలో మంగళవారం మృతదేహానికి పోస్టుమార్టం చేసిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

రైస్‌ మిల్లర్ల అరెస్ట్‌

శాయంపేట: మండలంలోని గట్లకానిపర్తిలోని లక్ష్మీ నరసింహ, శ్రీ వినాయక ఆగ్రో ఇండస్ట్రీస్‌ మిల్లు యాజమానులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పరకాల ఏసీపీ సతీశ్‌బాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం. మండలంలోని గట్లకానిపర్తికి చెందిన లక్ష్మీనరసింహ, శ్రీ వినాయక ఆగ్రో ఇండస్ట్రీస్‌ మిల్లుల్లో ఇటీవల విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధి కారులు సీఎంఆర్‌ వరి ధాన్యం అవకతవలపై తనఖీలు చేశారు. లక్ష్మీనరసింహ రైస్‌ మిల్లులో 15,318.14 టన్నులు షార్టేజ్‌ రాగా, దాని విలు వ రూ.4.42 కోట్లు, శ్రీ వినాయక ఆగ్రో ఇండస్ట్రీస్‌లో 15,969.87 టన్నులు షార్టేజ్‌ రాగా, వాటి విలువ రూ.4.61 కోట్లు తేడా వచ్చాయి. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిల్లర్లపై కేసు నమోదు చేసి సోమవారం రైస్‌ మిల్లల యజమానులు చౌళ్ల లక్ష్మణ్‌రావు, పెంచాల కిరణ్‌ను అరెస్ట్‌ చేసి పరకాల న్యాయస్థానంలో హాజరుపర్చారు. కోర్టు నిందితులకు రిమాండ్‌ కు విధించింది. ఇద్దరిని పరకాల సబ్‌ జైలుకు రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ సతీశ్‌బాబు తెలిపారు. ఆయన వెంట సీఐ సుధాకర్‌ రెడ్డి, ఎస్సై జక్కుల పరమేశ్‌, ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement