నయీంనగర్: దేశంలోని రాజ్యాంగ సంస్థలు తమ స్వతంత్రతను కోల్పోతున్నాయని వక్త కల్పన కన్నాభిరాన్ అన్నారు. హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు ఎస్.జీవన్ కుమార్ రచించిన వీధి బతుకులు విస్థాపనులు, సజీవ స్మృతులు పుస్తకాలను ఆదివారం కల్పన కన్నాభిరాన్ ఆవిష్కరించి మాట్లాడారు. విశ్వవిద్యాలయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం అనేక సమస్యలపై పరిశోధనలకు అనుమతులు ఇవ్వడం లేదని, కొన్ని అంశాలకు మాత్రమే అనుమతి ఇస్తోందని పేర్కొన్నారు. ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత మాట్లాడుతూ జీవన్‌కుమార్ తన 30 ఏళ్ల మానవ హక్కుల కార్యాచరణలో భాగంగా ప్రస్తావించిన సమస్యలు ఇప్పటికై నా పరిష్కారమైతే బాగుండని అన్నారు. సామాజిక సమస్యలను ప్రస్తావించే తమలాంటి వారిపై అసభ్యకరమైన ట్రోల్స్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పుస్తకాల రచయిత జీవన్‌కుమార్ సమావేశంలో తన అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, డా.తిరుపతయ్య, కాత్యాయనీ విద్మహే, వేమన వసంతలక్ష్మి, దేవులపల్లి అమర్, విమల, మెట్టు రవీందర్, కె.అనురాధ తదితరులు పాల్గొన్నారు.


