మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలోని కొన్ని పారిశుద్ధ్య వాహనాలు తరచూ మరమ్మతుల బారిన పడుతున్నాయి. వాటి రిపేర్ బిల్లుల పెండింగ్‌తో పలు వాహనాలు షెడ్డులకే పరిమితమయ్యాయి. కౌన్సిల్ ఆమోదంతోనే బిల్లుల క్లియర్ చేయాల్సి ఉండడంతో అధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. వాహనాల కొరతతో పలు వార్డుల్లో పారిశుద్ధ్య సమస్య జఠిలంగా మారింది. కమర్షియల్ ప్రాంతాలపై పెట్టిన దృష్టి మిగిలిన ప్రాంతాలపై పెట్టడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు రాకుంటే చెత్త ఎక్కడ వేయాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
లక్షకు పైగా జనాభా..
మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులు ఉండగా 65,712 మంది ఓటర్లు ఉన్నారు. విద్యా, వ్యాపారం, ఉద్యోగ పరంగా మానుకోటలో నివాసం ఉండే వారితో కలిపితే లక్ష జనాభా దాటుతుంది. విలీన గ్రామాలతో విస్తీర్ణం పెరిగింది. దాని తగ్గట్టుగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెరగలేదు.
143మంది పారిశుద్ధ్య కార్మికులు..
మానుకోట మున్సిపాలిటీలో 143 మంది కార్మికులు మాత్రమే ఉన్నారు. మొత్తం 47 వాహనాలు ఉండగా వాటిలో ఒకటి పూడికతీత మిషన్, రోడ్డు స్వీపింగ్ మిషన్, వైకుంఠరథం, 14 మూడు చక్రాల ఆటోలు, 19 నాలుగు చక్రాల ఆటోలు, 11 ట్రాక్టర్లు ఉన్నాయి. ప్రతీరోజు 33 టన్నుల చెత్త సేకరిస్తున్నారు. రెండు చెత్త డంపింగ్ యార్డులు ఉన్నాయి.
అక్కడే పలు వాహనాలు..
వాస్తవానికి ప్రతీ వార్డుకు ఒక వాహనం ఉండాలి. కానీ, తరచూ వాహనాల మరమ్మతుల వల్ల కొన్ని వార్డులకు రెండు రోజులకోసారి కూడా వాహనం వెళ్లడం లేదు. కాగా, 22వ వార్డుకు చెందిన ట్రాక్టర్ మరమ్మతుల బారిన పడడంతో రిపేర్ పూర్తిచేశారు. అయితే రూ.26,438 బిల్లు పెండింగ్ ఉండడంతో వాహనం షెడ్డులోనే ఉంది. అలాగే 6వ వార్డుకు చెందిన వాహనం మరమ్మతులకు గురికావడతో ఖమ్మం జిల్లా కేంద్రంలోని షోరూంకు నెలరోజుల క్రితం పంపారు. రూ.40,000 పైచిలుకు బిల్లు చెల్లించకపోవడంతో వాహనం అక్కడే ఉంది. మరికొన్ని వాహనాలనకు కూడా రిపేర్ చేయగా.. డబ్బులు చెల్లించే బాధ్యత నాది అని హామీ ఇచ్చి కమిషనర్ తీసుకొచ్చారు.
రోడ్లపై చెత్త వేస్తే జరిమానా..
రోడ్లపై చెత్త వేసేవారిని గుర్తించి మున్సిపల్ సిబ్బంది జరిమానాలు విధిస్తున్నారు. కమర్షియల్ ప్రాంతాల్లో వాణిజ్య సంస్థలతో పాటు గృహాల యజమానులకు జరిమానా విధిస్తున్నారు. అయితే వార్డులకు వాహనాలు రాకుంటే చెత్త ఎక్కడ వేయాలని స్థానికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.
రెండు రోజుల్లో
సమస్య తీరుతుంది
త్వరలో కౌన్సిల్ ఆమోదం తీసుకుని బిల్లులు క్లియర్ చేస్తాం. ఈ సమస్య పునరావృతం కాకుండా కౌన్సిల్‌లో చర్చించి సమస్య రాకుండా చూస్తాం. వాహనాలు రిపేర్ ఉన్న వార్డులకు వేరే వాహనాలను కేటాయిస్తున్నాం. డ్రెస్‌కోడ్‌తో పాటు పర్యవేక్షణ పెంచాం. వాహనాల సమస్య తీరితే పారిశుద్ధ్యం మెరుగుపడుతుంది.
– ఎం.వినోద్‌కుమార్, మున్సిపల్ కమిషనర్
పారిశుద్ధ్య వాహనాల రిపేర్ బిల్లుల క్లియరెన్స్‌లో జాప్యం
మానుకోట మున్సిపాలిటీలో అధ్వానంగా పారిశుద్ధ్యం
రోడ్లపై చెత్త వేస్తే జరిమానాలు
అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం
బిల్లుల పెండింగ్‌తోనే సమస్య..
గతంలో ఏడాదికి సరిపోను రిపేర్ ఖర్చులుగా బడ్జెట్ కేటాయించి తీర్మానం చేసే వారు. అయి తే ప్రస్తుతం కొత్త పాలక మండలి కావడంతో అది జరగడం లేదు. వాహనాల పెట్రోలు, రిపే ర్ బిల్లుల పెండింగ్ అధికారులకు తలనొప్పిగా మారింది. గతంలో అత్యవసర పరిస్థితుల్లో నాలుగు పార్టీల ఫ్లోర్‌లీడర్‌లతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుని సమస్యను పరిష్కరించేది. ప్రస్తుత అది జరగడం లేదు.


