సాగులో మార్పు రావాలి | - | Sakshi
Sakshi News home page

సాగులో మార్పు రావాలి

Jun 12 2026 5:51 AM | Updated on Jun 12 2026 5:51 AM

మహబూబాబాద్‌ రూరల్‌: రైతులు పంటల సాగులో మార్పు తీసుకురావాలని, నీటి వసతి ఆధారంగా పంటల సాగు చేయాలని, యూ రియా వాడకం తగ్గించాలని, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో స్వల్పకాలిక వరి రకాలు, ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్‌.విజయచంద్ర అన్నారు. భూసారం పెంచేందుకు పచ్చిరొట్ట ఎరువులు సాగు చేసి భూమిలో కలియదున్నాలని, విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, అధిక మొత్తంలో వ్యవసాయ భూమి ఉన్న రైతులు ఆయిల్‌పామ్‌ సాగు చేయాలన్నారు. వానాకాలం పంటల సాగు నేపథ్యంలో విత్తనాల సేకరణ, ఎరువుల యాజమాన్యం, నకిలీ విత్తనాలను గుర్తించడం వంటి అంశాలపై రైతుల సందేహాలను నివృత్తి చేసేందుకు సాక్షి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఫోన్‌ఇన్‌ కార్యక్రమానికి అ నూహ్య స్పందన వచ్చింది. రైతులు అడిగిన ప్రశ్నలకు డీఏఓ ఎస్‌.విజయచంద్ర, జిల్లా ఉద్యాన, ప ట్టు పరిశ్రమ శాఖ అధికారి మరియన్న సమాధానాలు చెప్పి వారి సందేహాలను నివృత్తి చేశారు.

ప్రశ్న: ఖరీఫ్‌కు అనువైన వరి రకాలు ఏమిటి?

రైతులు: శ్రీనివాస్‌రెడ్డి గూడూరు, నవీన్‌ కొత్తగూడ, సత్తిరెడ్డి బయ్యారం, శ్రీనివాస్‌ జంగిలిగొండ, వెంకన్న జయ్యారం, వేణుగోపాల్‌ గుండెపుడి, సురేష్‌ బొడ్లాడ, హరినాయక్‌ వీరారం.

జవాబు: ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు స్వల్పకాలిక వరి రకాలను సాగుచేయడం మేలుదాయకం. వరిలో బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్‌ 15048(తెలంగాణ సోనా), హెచ్‌ఎంటీ, జైశ్రీరామ్‌, కేఎన్‌ఎం 1638, డబ్ల్యూజీఎల్‌ 44, డబ్ల్యూజీఎల్‌ 962, జేజీఎల్‌ 1798, ఎంటీయూ 1010, కేఎన్‌ఎం 118 వంటి రకాలు సాగు చేసుకోవచ్చు.

ప్ర: పత్తిలో అధిక దిగుబడికి ఏ రకం విత్తనాలు నాటాలి?

రైతులు: నాగయ్య కురవి, రాజశేఖర్‌ కంబాలపల్లి, నవీన్‌ పర్వతగిరి, వెంకన్న బూరుకుంటతండా, లక్ష్మణ్‌ వేంనూర్‌, లింగన్న వీఎస్‌ లక్ష్మీపురం.

జ: పత్తిలో అధిక సాంద్రత పద్ధతి ద్వారా సాగు చేస్తే రైతులకు మంచి దిగుబడి వస్తుంది. మొక్కల మధ్య దూరం తగ్గి అధిక మొక్కలు వేసుకునేందుకు వీలుంటుంది. నూజివీడు రకాలు ఎంచుకోవడం మంచిది. రాశిలో స్విఫ్ట్‌, నూజివీడులో సిరి, వేదలో ప్లాటినం రకాలు సాగు చేసుకోవచ్చు.

ప్ర: నకిలీ విత్తనాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

రైతులు: ఉపేందర్‌ గూడూరు, రఘు నడివాడ, యాకూబ్‌రెడ్డి చిన్నగూడూరు, రాజు కంఠాయపాలెం, విజయ్‌ ఉగ్గంపల్లి.

జ: నకిలీ విత్తనాలు అని అనుమానం వస్తే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో, మండల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయాలి. రైతులు లైసెన్స్‌ పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. పంటకాలం పూర్తయ్యే వరకు ఖాళీ ప్యాకెట్లు, బిల్లులు తమ వద్ద ఉంచుకోవాలి. లాట్‌ నంబర్‌ వేయించాలి. రైతు, షాపు యజమాని ఇద్దరి సంతకం ఉండాలి. గ్రామాల్లోకి వచ్చి విత్తనాలు అమ్మే వారిని నమ్మవద్దు. జాగ్రత్తలు పాటిస్తే పంటనష్టం జరిగినప్పుడు పరిహారం వచ్చేందుకు వీలుంటుంది.

ప్ర: యూరియా పంపిణీలో మార్పులు చేస్తారా?

రైతులు: కృష్ణ డోర్నకల్‌, మల్లయ్య, శ్రీనివాస్‌ కొమ్ములవంచ, ఠానూనాయక్‌ బిల్యాతండా, వినయ్‌, సాయికుమార్‌ మడగూడ, అనిల్‌ వెంక్యాతండా, మోతిలాల్‌ గుండ్లబోడుతండా, అశోక్‌ బోరింగ్‌తండా, వెంకన్న ఇస్లావత్‌తండా, సైదులు రెడ్యాల.

జ: రైతులు యూరియాను యాప్‌ద్వారా మాత్రమే బుక్‌ చేసుకోవాలి. ప్రస్తుతానికి యూరియా పంపిణీ విషయంలో ఎలాంటి మార్పులు లేవు. యాప్‌లో బుకింగ్‌ గురించి తెలియని వారు సంబంధిత షాపుల వద్ద ఉండే వలంటీర్లను సంప్రదించాలి. రైతు వేదికల వద్ద ఏఈఓలు సహకారం అందిస్తారు. పంటల సాగు విషయంలో రైతులు సాధ్యమైనంత వరకు యూరియా వాడకాన్ని తగ్గించి నానోయూరియా వినియోగంపై దృష్టి సారించాలి.

ప్ర: పచ్చిరొట్ట ఎరువుల ప్రయోజనాలు ఏమిటి?

రైతులు: నవీన్‌ కొత్తగూడ, శ్రీనివాస్‌రెడ్డి గూడూరు, కిషన్‌ గార్ల, శ్రీనివాస్‌ అమీనాపురం, మహేశ్‌ చిట్యాల, శంకర్‌ పెద్దవంగర, ఉప్పలయ్య అమ్మాపురం, రాంబాబు గుర్రాలగుట్టతండా, వెంకన్న పర్వతగిరి, శ్రీహరి కొత్తగూడ.

జ: పంటల సాగుకు ముందుగానే పచ్చిరొట్ట ఎరువులైన జిలుగ, జనుము సాగు చేసి భూమిలో కలియదున్నాలి. భూసారం పెంచేందుకు పచ్చిరొట్ట ఎరువులు ఎంతగానో దోహదం చేస్తాయి. అదే విధంగా ఎప్పటికీ ఒకేరకం పంటలు కాకుండా ఆరుతడి పంటలైన కందులు, మినుములు, పెసర, బొబ్బెర, నువ్వులు తదితర రకాలు సాగు చేయడం మంచిది. పంట మార్పిడి విధానాన్ని పాటిస్తూ పత్తి, మిర్చి, మక్కజొన్న వరకే కాకుండా ఆయిల్‌పామ్‌ సాగుపై దృష్టి పెంచాలి.

ప్ర: మిరపనారు కొనుగోలు చేయవచ్చా?

రైతులు: రాంబాబు గుర్రాలగుట్ట, ఉప్పలయ్య అమ్మాపురం, శ్రీనివాస్‌ కొమ్ములవంచ, శేఖర్‌, సాగర్‌ మల్యాల, రమేశ్‌ సికింద్రాబాద్‌, నరేష్‌ చోక్లాతండా, సునీల్‌ దామ్యతండా, నవీన్‌ రామచంద్రుతండా, సతీష్‌, గణేష్‌ రెడ్యాల.

జ: మిరపనారు సిద్ధం చేసుకునేందుకు రైతులు మిరప విత్తనాలు కొనుగోలు చేయగానే ముందుగా విత్తనశుద్ధి చేసుకోవాలి. ఎత్తు నారుమడులు పోసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన నారు చేతికి అందుతుంది. మిరపసాగు సమయంలో పంట మధ్యలో పసుపురంగు, నీలిరంగు, జిగురు అట్టాలను ఏర్పాటు చేసుకుంటే దోమ, నల్లి బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. మిరపనారు పోసుకోని రైతులు నర్సరీల్లో కొనుగోలు చేసుకుని ప్రభుత్వ నిబంధనల మేరకు రశీదులు తీసుకుని మిరప సాగు చేయాలి.

ప్ర: వరి నారుమడిలో జాగ్రత్తలు ఏమిటి?

రైతులు: ఉప్పలయ్య అమ్మాపురం, హరినాయక్‌ వీరారం, సత్తిరెడ్డి బయ్యారం, విజయ్‌ ఉగ్గంపల్లి, యాకూబ్‌రెడ్డి చిన్నగూడూరు, నవీన్‌ కొత్తగూడ, నాగయ్య కురవి, శ్రీనివాస్‌రెడ్డి గూడూరు, సుధాకర్‌, శ్రీనివాస్‌ జంగిలిగొండ,

మల్లయ్య కొమ్ములవంచ.

జ: వరినారు మడిలో తగిన జాగ్రత్తలు పాటించి ప్రధాన పొలం సాగుకంటే ముందు జిప్సమ్‌ వేసుకుని కలియదున్నాలి. యూరియా తగ్గించి నానో యూరియా అలవాటు చేసుకుని కాంప్లెక్స్‌ ఎరువులు కూడా సిఫార్సు మేరకే వాడాలి. రసాయనాలు పురుగుమందుల వాడకం తగ్గిస్తే పంట దిగుబడి మంచిగా వస్తుంది. నేరుగా వరివిత్తే విధానం మంచిది. వర్షాలు పడకముందు పంట సాగు చేయవద్దు. వరిలో కాలిబాటలు తీస్తే పంటకు ఎలాంటి దోమపోటు రాకుండా ఉంటుంది.

నీటి వసతి ఆధారంగా పంటలు ఎంపిక చేసుకోవాలి

స్వల్పకాలిక రకాలు వేయాలి

భూసారం పెంచేందుకు పచ్చిరొట్ట ఎరువులు

యూరియా వాడకం తగ్గించాలి

విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు పాటించాలి

‘సాక్షి’ ఫోన్‌ఇన్‌ కార్యక్రమంలో

డీఏఓ విజయచంద్ర

రైతుల నుంచి అనూహ్య స్పందన

Advertisement
 
Advertisement
Advertisement