ఓటరు కోసం ఆధారాలు..
సర్ ప్రక్రియలో భాగంగా ఓటరు వద్దకు వచ్చిన సర్వే అధికారులకు ప్రభుత్వం నుంచి జారీ చేసిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఒకటి చూపించొచ్చు. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు పనిచేస్తున్న ఉద్యోగ గుర్తింపు కార్డు, బ్యాంకు, పోస్టాఫీసు, ఎల్‌ఐసీ, పీఎస్‌యూ ద్వారా పొందిన కార్డులు, అధికారులు జారీ చేసిన పుట్టినతేదీ సర్టిఫికెట్, విద్యార్హత సర్టిఫికెట్, నివాస ధ్రువీకరణ పత్రం, అటవీ హక్కు పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రం, ఎన్‌ఆర్‌సీ, కుటుంబ రిజిస్ట్రేషన్, పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ మొదలైనవి దోహదపడుతాయి.
సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్) ప్రక్రియ జిల్లాలో వేగవంతంగా జరుగుతోంది. 94శాతం ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేసుకొని మానుకోట జిల్లాను రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలిపారు. ఈనెల 25నుంచి ఇంటింటి గణన ప్రారంభం కానుంది. అయితే ఓటర్లు గల్లంతు కాకుండా రాజకీయ పార్టీల నాయకులు సర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
94శాతం మ్యాపింగ్ పూర్తి..
ప్రజాస్వామ్యంలో ఓటు కీలకం. కాగా, అర్హులకు ఓటు హక్కు కల్పించడం ఎంత ముఖ్యమో, నకిలీ ఓట్లను తొలగించడం అంతే అవసరం. ఇందుకోసం ప్రభుత్వం చేపట్టిన సర్ కార్యక్రమంలో కలెక్టర్ ప్రత్యేక ప్రణాళికలతో వెళ్తున్నారు. ఒకేసారి సవరణ కార్యక్రమం మొదలు పెడితే ఓటరును గుర్తించడం ఇబ్బందిగా ఉంటుందని ముందుగా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లోని 555 పోలింగ్ స్టేషన్లల్లో మొత్తం 4,84,933 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 4,57,819 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేసుకున్నారు. 94శాతం మ్యాపింగ్ పూర్తి చేసి రాష్ట్రంలోనే మహబూబాబాద్ మొదటి స్థానంలో నిలిచింది.
ఈనెల 25 నుంచి ప్రారంభం..
సర్ అసలు ప్రక్రియ ఈనెల 25నుంచి ప్రారంభం కానుంది. ఇంటింటి గణనతో ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ అక్టోబర్ ఒకటో తేదీన ప్రచురించి ఓటరు సవరణ తుది జాబితా వరకు సాగనుంది. సర్వేకోసం జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలో ఇద్దరు ఆర్డీఓలు ఈఆర్‌ఓలుగా, 12 మంది తహసీల్దార్లు ఏఈఆర్‌ఓలుగా, వీరి పరిధిలో 56 మంది సూపర్ వైజర్లు.. వారి పరిధిలో మొత్తం 555 మంది బీఎల్‌ఓలు పనిచేస్తున్నారు. ఈనెల 25 నుంచి జూలై 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే.. జూలై 31న ముసాయిదా(డ్రాఫ్టింగ్) ఓటరు జాబితా ప్రచురణ, జూలై 31 నుంచి ఆగస్టు 30వరకు క్లైమ్, అభ్యంతరాల స్వీకరణ, సెప్టెంబర్ 28 వరకు నోటీసుల జారీ, ఎన్యుమరేషన్ ఫామ్స్‌పై నిర్ణయం, అభ్యంతరాల పరిష్కారం మొదౖలైన ప్రక్రియ జరుగుతుంది. అక్టోబర్ ఒకటిన తుది ఓటరు జాబితా విడుదల చేస్తారు.
రాజకీయ నాయకుల ఆరా..
తమ ప్రాంతానికి చెందిన ఓటర్లు జాబితా నుంచి వైదొలిగిపోకుండా రాజకీయ నాయకులు ప్రత్యేక ఆరా తీస్తున్నారు. బిహార్ రాష్ట్రంలో సర్ ద్వారా 65 లక్షల ఓటర్ల పేర్లు, పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల తొలగింపు పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తమ అనుచరులు, పార్టీల నాయకుల ఓట్లు గల్లంతు కాకుండా జాగ్రత్త పడుతున్నారు. కార్యకర్తలను బీఎల్‌ఓల వద్దకు పంపించి జాబితా చూడటం, మ్యాపింగ్‌లో పేర్లు ఉన్నాయా లేదా చూడడం, ధ్రువీకరణ పత్రాలు నింపే సమయంలో పొరపాట్లు జరగకుండా చూసేందుకు వార్డుల వారీగా అన్ని పార్టీల నాయకులు సిద్ధమవుతున్నారు.
మ్యాపింగ్ ప్రక్రియ ఇలా..
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో జిల్లా ముందంజ
94శాతం మ్యాపింగ్ పూర్తితో
రాష్ట్రంలోనే మొదటిస్థానం
ఓటర్ల పేర్లు మిస్‌కాకుండా రాజకీయ నాయకుల ఆరా
ఈనెల 25నుంచి ఇంటింటి గణన
నియోజకవర్గం పీఎస్‌లు ఓటర్లు మ్యాపింగ్ శాతం
మహబూబాబాద్ 288 2,60,761 2,51,693 96
డోర్నకల్ 267 2,24,172 2,06,126 91
మొత్తం 555 4,84,940 4,57,819 94


