● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
మహబూబాబాద్ రూరల్: నకిలీ విత్తనాలను నివారిస్తూ రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందేలా చూడాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం వ్యవసాయశాఖ, గృహ నిర్మాణశాఖ అధికారులతో వేర్వేరుగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ.. వానాకా లం సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల లభ్యతపై తెలియజేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ఖరీఫ్ సీజన్ పంటల సాగులో రైతులు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. రైతులకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వ్యవసాయ విస్తరణాధికారులు, మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. డీఏఓ విజయచంద్ర, ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓలు, ఏఈఓలు ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై..
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తుందని ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. మొదటి విడతలో కొంతమంది లబ్ధిదారులకు సాంకేతిక కారణాల వల్ల, లబ్ధిదారుల జెండర్ మార్పుల వల్ల పేమెంట్ సమస్య ఎదురవుతుందని, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మొదటి విడతలో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నా రు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఎలాంటి అవినీతికి తావులేకుండా, అర్హులైన పేదలకు ఇళ్లు అందేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో నిర్మాణ పనుల పురోగతిని పర్యవేక్షించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో గృహ నిర్మాణశాఖ ఇన్‌చార్జ్ పీడీ పురుషోత్తం, మున్సిపల్ కమిషనర్ వినోద్ కుమార్, వివిధ మండలాల ఎంపీడీఓలు పాల్గొన్నారు.


