కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో మరమ్మతుల పూర్తి చేసి వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సాగునీరందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఇరిగేషన్‌శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కల్నల్ పరీక్షిత్ మెహ్రాతో కలిసి మంత్రి ఉత్తమ్ ప్రత్యేక హెలికాప్టర్‌లో బుధవారం మధ్యాహ్నం 2.15గంటలకు మేడిగడ్డకు చేరుకున్నారు. అక్కడినుంచి కాన్వాయ్‌లో బ్యారేజీ దిగువకు వెళ్లారు. పుణెకు చెందిన సైంటిస్టులు, ఇరిగేషన్‌శాఖ ఇంజనీర్లతో మాట్లాడి పరీక్షలు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. అక్కడి నుంచి బ్యారేజీ ఎగువన యాగశాల వద్ద ఏర్పాటు చేసిన సమీక్షలో పాల్గొన్నారు. ముందుగా కల్నల్ పరీక్షిత్ మెహ్రా బ్యారేజీల్లో జరుగుతున్న పరీక్షలను ఒక్కొక్కటిగా వీడియోలు, ఫొటోల ఆధారంగా వివరించారు. రాత్రిపగలు పరీక్షలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎన్‌డీఎస్‌ఏ, సీడబ్ల్యూపీఆర్‌ల ఆదేశాలకు అనుగుణంగా పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ లోపభూయిష్టమైన నిర్మాణం వల్లనే కుంగినట్లు తెలిపారు. కారణాలను లోతుగా విశ్లేషణ చేసేందుకు సీడబ్ల్యూసీ, ఎన్‌డీఎస్‌ఏ వంటి ప్రతిష్టాత్మకమైన అనుభవం కలిగిన సంస్థలతో పరీక్షలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు. భారత సైన్యంలో అత్యంత నైపుణ్యం, అనుభవం కలిగిన కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో ముందుకుపోతున్నట్లు తెలిపారు. ఎన్‌డీఎస్‌ఏ గుర్తించిన స్కౌర్ డెప్త్, కట్–ఆఫ్ డెప్త్, టెయిల్ వాటర్ రేటింగ్ కర్వ్, ఎనర్జీ డిసిప్లేషన్, గేట్ల నిర్వహణ వంటి కీలక అంశాలపై సమగ్ర అధ్యయనాలు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ రైతాంగానికి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరేలా ప్రాజెక్టులను తిరిగి సురక్షితంగా, సమర్థవంతంగా అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, సీఈ శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
గంటపాటు మేడిగడ్డ బ్యారేజీలో పర్యటన.. పరిశోధనల తనిఖీ
మూడు బ్యారేజీల్లోని పరీక్షల వివరాలు వెల్లడి


