పెద్దవంగర: గ్రామసభలు గ్రామాభివృద్ధికి పునాది వంటివని, గ్రామంలోని సమస్యలు, అవసరాలు, అభివృద్ధి ప్రాధాన్యతలను ప్రజలే నిర్ణయించే వేదిక గ్రామసభ అని కలెక్టర్ స్నేహశబరీష్ పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం మండలంలోని ఉప్పరగూడెం గ్రామంలో సర్పంచ్ దుంపల శ్రీదేవి కుమారస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం పెరగడమే కాకుండా భూమి లోని పోషకాలు, సూక్ష్మజీవులు దెబ్బతింటాయని అన్నారు. రైతులు వరి కొయ్యలను కాల్చకుండా ప్రత్యామ్నాయ పద్ధతిలో వినియోగించాలని సూచి ంచారు. నిబంధనలు ఉల్లంఘించి కొయ్యలను కాల్చితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. భూసారాన్ని కాపాడుకోవడానికి పంట మార్పిడి విధానం అవసరమని, వ్యవసాయశాఖ అధికారులు రైతులకు భూసార పరీక్షలు నిర్వహిస్తూ ఆధునిక సాగు విధానంపై అవగాహన కల్పించాలని అదేశించారు. గ్రామంలో ప్రతీ ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, నిర్మించిన మరుగుదొడ్లను ప్రజలు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. విద్యార్థులు తమ లక్ష్యసాధనపై దృష్టి సారించి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం పలు దరఖాస్తులను స్వీకరించి సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వేణుమాధవ్, తహసీల్దార్ వినోద్ కుమార్, ఏఓ స్వామి నాయక్, ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్, ఎంఈఓ శ్రీనివాస్, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
డబుల్ బెడ్రూం ఇళ్ల పరిశీలన
మహబూబాబాద్: జిల్లా కేంద్రం శివారులోని గుమ్ముడూర్ ప్రాంతంలో మధ్యలో నిలిచిపోయిన డబుల్ బెడ్రూం ఇళ్లను బుధవారం కలెక్టర్ స్నేహశబరీష్ పరిశీలించారు. నిర్మాణాలు నిలిచిపోవడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అందుకు తహసీల్దార్ చంద్రరాజేశ్వర్ కోర్టు కేసులో ఉందని చెప్పారు. సమస్యను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆమె వెంట డీఈఈ ఉపేందర్, సంబంధిత అధికారులు ఉన్నారు.
కలెక్టర్ స్నేహశబరీష్
మాట్లాడుతున్న కలెక్టర్ స్నేహ శబరీష్


