మహబూబాబాద్ రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియతో ఓట్ల తొలగింపునకు కుట్ర చేస్తోందని టీపీసీసీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నర్సిరెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పీఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో సర్ ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్లకు బుధవారం శిక్షణ ఇచ్చారు. ముఖ్య అతిథిగా నర్సిరెడ్డి హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సున్నితమైన అంశాలతో రాజకీయాలు చేయడం సరికాదని, సర్ ప్రక్రియ విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశ్చిమ బెంగాల్, బిహార్, తమిళనాడు రాష్ట్రాల్లో ఓట్లు అక్రమంగా తొలగించారని ఆరోపించారు. 2002నాటి ఓటరు జాబితా ఆధారంగా చేసుకుని నూతన ఓట్లను తొలగించే ప్రయత్నం చేసే ప్రమాదం ఉందని, దీనిని అడ్డుకోవడానికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, కానీ వారు ప్రజలను పక్కదారి పట్టించే ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. జూన్ 25 నుంచి జూలై 24వ తేదీ వరకు సర్ ప్రక్రి య కొనసాగనుందని, ఓటరు నమోదు ప్రక్రియ, ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టత నిచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉమా, సర్ మానుకోట, డోర్నకల్ ఇన్‌చార్జ్‌లు పులి అనిల్ కుమార్, అవేజ్, అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజయ్య, మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
టీపీసీసీ పార్లమెంట్ ఇన్‌చార్జ్ నర్సిరెడ్డి


