మొన్న.. నిన్న.. నేడు | - | Sakshi
Sakshi News home page

మొన్న.. నిన్న.. నేడు

Jun 11 2026 7:53 AM | Updated on Jun 11 2026 7:53 AM

మొన్న.. నిన్న.. నేడు

వరంగల్‌ అర్బన్‌ : వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి మొయిన్‌ గేట్‌కు ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై తాగునీటి పైపులైన్‌ లీకేజీ కావడంతో మరమ్మతు కోసం తవ్వకాలు చేశారు. లీకేజీని సరిచేసి గుంతను తవ్విన మట్టితోనే పూడ్చివేసి చేతులు దులుపుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఒకరోజు గడవకముందే గుంతగా మారింది. నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే రోడ్డులో ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నమైంది. చూడలేక, వాహనదారుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వరంగల్‌ ట్రాఫిక్‌ పోలీసులు నడిరోడ్డుపై ఏర్పడిన గుంత వద్ద బారికేడ్‌ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’లో’ ఈనెల 7వ తేదీన ‘ప్రమాదాలకు కేరాఫ్‌ ఎంజీఎం రోడ్డు’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. మరునాడు ట్రాఫిక్‌ పోలీసులు స్పందించి బల్దియా ఇంజనీర్ల దృష్టికి తీసుకెళ్లారు. కాంట్రాక్టర్‌ సహకారం, ట్రాఫిక్‌ పోలీసుల చొరవతో కంకర డస్ట్‌, ఇసుక పోసి గుంతను పూడ్చి వేశారు. బారికేడ్‌ను తొలగించారు. ఒకటి, రెండు రోజులు గడవకముందే ఆ గుంత మళ్లీ కుంగిపోయింది. రెండు రోజులుగా గుంత ప్రమాదకరంగా మారడంతో ట్రాఫిక్‌ పోలీసులు మళ్లీ బారికేడ్‌ పెట్టారు. ఈ రహదారి ప్రధాన నిర్వహణ బాధ్యత ఆర్‌అండ్‌బీ ఇంజనీర్లతోపాటు పైపులైన్‌ లీకేజీ కోసం తవ్వకం చేసిన బల్దియా ఇంజనీర్లది. కానీ ఎవరికి వారు అన్నట్లు వ్యవహరించడంతో వాహనదారులు ఇక్కట్ల పాలవుతున్నారు. ఇకనైనా ఆర్‌అండ్‌బీ, బల్దియా ఇంజనీర్లు ప్రధాన రహదారిపై గుంత ఏర్పడకుండా శాశ్వత మరమ్మతులు చేయాలని వాహనదారులు, ప్రజలు విన్నవిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement