రైల్వే శాఖకు
ఏకగ్రీవ తీర్మానాలు..
కోచ్ ఫ్యాకర్టీలో భూనిర్వాసితులతోపాటు స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలి
కాజీపేట: కాజీపేట శివారులోని అయోధ్యపురంలో నిర్మితమవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యం కల్పించాలంటూ రైల్వే జేఏసీ చేపట్టిన ఉద్యమం ఊపందుకుంటోంది. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ప్రజలు జిల్లా కేంద్రంలో భారీ రైల్వే ప్రాజెక్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కమ్యూనిస్టు నాయకులు బీఆర్ భగవాన్ దాస్, మడత కాళిదాసు ఆది నుంచి కోచ్ ఫ్యాక్టరీ సాధనకు ఎన్నో ఉద్యమాలు చేపట్టారు. సీపీఐ పార్టీ పక్షాన ఎక్కడా సమావేశం జరిగినా వీరి ప్రసంగాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశమే ప్రధానంగా వినిపించేది. వీరి పోరాట ఫలితంగా ఒక దశలో కోచ్ ఫ్యాక్టరీ వచ్చినట్లుగానే అందరూ భావించారు. 1980లో అప్పటి పాలకుల ఆదేశం మేరకు అధికారులు ధర్మసాగర్ మండల కేంద్రం సమీపంలో ప్రత్యేక సర్వే నిర్వహించారు. ఆ తర్వాత పంజాబ్ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపధ్యంలో కోచ్ ఫ్యాక్టరీని అక్కడకు తరలించారు.
తెలంగాణ ఉద్యమానికి
సమానంగా కోచ్ ఫ్యాక్టరీ ఉద్యమం..
తెలంగాణ ఏర్పాటు ఉద్యమంతోపాటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని స్థాపించాలని కోరుతూ ఉద్యమం మరోమారు ఊపందుకుంది. దీనికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం కాజీపేటకు రైల్వే వర్క్ షాపు షెడ్ మంజూరు చేసింది. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ముగిసిన అనంతరం రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్థల సేకరణకు అవసరమైన నిధులు మంజూరు చేసి 160 ఎకరాల మెట్టుగుట్ట సీతారామచంద్ర స్వామి దేవాదాయ భూములను కోర్టు అనుమతితో కొనుగోలు చేసింది. ఈ విధానం ద్వారా ఏళ్లుగా దేవాలయ భూములను సాగుచేసుకుంటున్న రైతులకు పరిహారం చెల్లించి సేకరించిన భూములను రైల్వే శాఖకు అప్పగించింది. ఆ స్థలంలో మొదటగా రైల్వే శాఖ పీఓహెచ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వీటన్నింటి మార్పిడి చేసి ప్రజల ఆకాంక్ష మేరకు రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ప్రకటించింది. తదనుగుణంగా ఆ స్థలంలో దాదాపు రూ.687 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు మరో మూడు నెలలో పనులు పూర్తికానున్న నేపథ్యంలో స్థానిక నిరుద్యోగ యువతకు రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ఉద్యోగ నియామకాల్లో ప్రత్యేక రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలనే నినాదం మెల్లమెల్లగా విస్తరిస్తోంది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సభలు, సమావేశాలతో పాటు ఏకగ్రీవ తీర్మానాలు ఆమోదించి రైల్వే శాఖకు పంపిస్తున్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు ప్రారంభమైన ప్రాంతాల్లో మొద టి దఫా చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో కల్పించిన విధంగా కాజీపేట యూనిట్‌లో భూ నిర్వాసితులతోపాటు ఉమ్మడి జిల్లా నిరుద్యోగ యువతకు రిజర్వేషన్ సౌకర్యం ఇవ్వాలని డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. ఇటీవల కోచ్ ఫ్యాక్టరీ ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో మహాదీక్ష నిర్వహించి విజయవంతం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు విన తి పత్రాలు అందజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా ఆకాంక్షను గుర్తించి తగు నిర్ణ యం ప్రకటిస్తుందనే ఆశాభావాన్ని జేఏసీ నేతలు, నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.
రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో
ఊపందుకుంటున్న పోరు
కేంద్ర ప్రభుత్వంపైనే నిరుద్యోగుల ఆశలు
ప్రకటన కోసం ఎదురుచూపులు


