● ముల్కలగూడెంలో ఘటన
ఐనవోలు: చెరువులో పడి ఓ గొర్రెల కాపరి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని ముల్కలగూడెంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జక్కుల రాజు(42) వ్యవసాయంతోపాటు గొర్రెల పోషణ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉగాది పండుగ సందర్భంగా గొర్రెలను శుభ్రం చేయడానికి మందను ముల్కల చెరువులోకి తీసుకెళ్లాడు. అక్కడ గొర్రెలను శుభ్రం చేస్తుండగా చెరువులో లోతు ఎక్కువ ఉండడంతో బురదలో చిక్కుకుని ఊపిరాడక మృతిచెందాడు. మృతుడికి భార్య రేణుక, కుమారై జ్యోతి, కుమారులు శేఖర్, రాజ్‌కుమార్ ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మట్టి తరలించడంతోనే..
కొందరు కాంట్రాక్టర్లు నీళ్లు లేని సమయంలో చెరువు మట్టిని ఇష్టారీతిన తరలించడంతో లోతు ఎక్కడ.. ఎంత మేర ఉందో తెలియపోవడంతో పలువురు నీటిలో మునిగి చనిపోతున్నట్లు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే చెరువులో పడి గతంలో ఇద్దరు మృతి చెందారని, ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ఎండాకాలంలో మట్టిని తరలించకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


