మార్గదర్శకాలపై మండిపాటు | - | Sakshi
Sakshi News home page

మార్గదర్శకాలపై మండిపాటు

Mar 20 2026 8:22 AM | Updated on Mar 20 2026 8:22 AM

హన్మకొండ : ట్రాన్స్‌కో వరంగల్‌ జోన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ వ్యవహార శైలిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉద్యోగులు క్షేత్ర స్థాయిని వీడడం, అధికారులను కలవడంపై ఇటీవల ట్రాన్స్‌కో వరంగల్‌ జోన్‌ యాజమాన్యం జారీ చేసిన మెమో వివాదాస్పదమైంది. ఈ మెమో(క్రమ శిక్షణ మార్గదర్శకాలు)పై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. క్రమ శిక్షణ మార్గదర్శకాల పేరుతో ఇటీవల మెమో జారీ చేశారు. దీని ద్వారా క్షేత్ర స్థాయి ఉద్యోగులు సంబంధిత అధికారి అనుమతి లేకుండా ట్రాన్స్‌కో వరంగల్‌ జోన్‌ కార్యాలయానికి, హైదరాబాద్‌లోని విద్యుత్‌ సౌధాకు రావొద్దని ఆంక్షలు విధించారు. ఇక నుంచి ఏ ఉద్యోగి, ఆర్టిజన్‌ అయినా తమ సమస్యల పరిష్కారం కోసం వరంగల్‌ జోన్‌ కార్యాలయం, విద్యుత్‌ సౌధాకు వెళ్లడానికి సంబంధిత కంట్రోలింగ్‌ అధికారి అనుమతి తీసుకోవాల్సిందేనని సూచించారు. దీనిని ఉల్లంఘిస్తే సంబంధిత ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సిబ్బందిపై పర్యవేక్షణ కొరవడితే కంట్రోలింగ్‌ అధికారులపై చర్యలు తప్పవని మెమోలో పేర్కొన్నారు.

ఇలాంటి ఆంక్షలు విధిస్తే సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి?

ట్రాన్స్‌ కో వరంగల్‌ జోన్‌లో ఇటీవల జారీ చేసిన క్రమశిక్షణ మార్గదర్శకాలు ఉద్యోగుల్లో ఆందోళనకు దారితీస్తున్నాయి. సమస్యలు చెప్పుకునే అవకాశమే లేకుండా ఆంక్షలు విధిస్తున్నారని మండిపడుతున్నారు. క్షేత్ర స్థాయి ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటారని, వాటిని అధికారులకు దృష్టికి తీసుకెళ్లడానికి అనుమతి అవసరమని చెప్పడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఆంక్షలు విధిస్తే తమ సమస్యలు ఎవరితో చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఇది ఒక రకంగా ఉద్యోగులను వేధించడమేనని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.

ఆంధ్ర అధికారి కావడంతోనే కఠిన ఆంక్షలు..

ఆంధ్ర అధికారి కావడంతోనే తెలంగాణ ఉద్యోగులపై కఠిన ఆంక్షలు, మార్గదర్శకాలు ప్రవేశ పడుతున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఇంకా ఆంధ్ర అధికారుల పెత్తనం కొనసాగడం బాధాకరమని ఉద్యోగులు, సంఘాలు పేర్కొన్నాయి. వరంగల్‌ జోన్‌లో పరిస్థితులు ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికై నా ట్రాన్స్‌ కో చీఫ్‌ ఇంజనీర్‌ తీసుకున్న కఠిన నిర్ణయాలను ఉపసంహరించుకుని, తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించాలని ఉద్యోగులు, సంఘాలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఆందోళనకు సిద్ధమవుతున్న ఉద్యోగులు

ట్రాన్స్‌కోలో వివాదాస్పదమవుతున్న మెమో

చీఫ్‌ ఇంజనీర్‌ తీరుపై వెల్లువెత్తుతున్న

విమర్శలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement