● బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి
హన్మకొండ : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో చాలా లోపాలున్నాయని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండ దీన్‌దయాళ్ నగర్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా పదాధికారుల సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియా బలోపేతం, ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం అమలు, ప్రశిక్షణ అభియాన్ పై చర్చించారు. జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఇష్టానుసారంగా జరుగుతోందని, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ కార్పొరేటర్లను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పక్కదారి పడుతోందని తెలిపారు. ఈవారంలో నిర్వహించనున్న మండల స్థాయి ప్రశిక్షణ అభియాన్‌ను విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలోని అన్ని మండలాల్లో జరిగే ప్రశిక్షణకు పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలన్నారు. జిల్లాలో పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడానికి సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించాలన్నారు. ఇంటి పన్నులు బలవంతంగా వసూలు చేయవద్దని, ప్రజా సమస్యలపై పార్టీ పోరాడుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆర్పీ.జయంత్, సండ్ర మధు, ఇతర పదాధికారులు పాల్గొన్నారు.


