కాళేశ్వరం : కాళేశ్వరంలో మే 21నుంచి జూన్ 1వ తేదీ వరకు సరస్వతి నది అంత్య పుష్కరాలు.. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు గోదావరి నది పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ప్రణాళికలు చేశామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కాళేశ్వరం నుంచి పలుగుల వరకు రూ.22 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు, కాళేశ్వరంలో రూ.1.20 కోట్లతో చేపట్టనున్న మ్యూజియం పనులకు, ఆది ముక్తేశ్వర దేవస్థానం నుంచి సరస్వతి ఘాట్ వరకు రూ.2.38 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.రూ.1.55 కోట్లతో నిర్మించిన అన్నదాన సత్రాన్ని మంత్రి ప్రారంభించారు. కాళేశ్వరం, అన్నారం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. పూర్తి చేయాల్సిన పనులకు డెడ్ లైన్ పెట్టండి..అప్పటి వరకు పూర్తి చేయకపోతే అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి శాఖ పరంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు.
పుష్కరాలపై సమీక్ష..
ఈఓ కార్యాలయంలో సరస్వతి అంత్య పుష్కరాలు, గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎస్‌ఈ స్థాయి అధికారులు హాజరు కాకపోవడంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మాకేం పని లేదనుకుంటున్నారా’ పుష్కరాల కంటే ముఖ్యమైన పనులు ఏం ఉన్నాయి?’ అని అధికారులను ప్రశ్నించారు. బస్టాండ్‌కు చెరువు స్థలం కేటాయించాలని సీసీఎల్‌ఏతో ఫోన్‌లో మాట్లాడారు. బస్టాండ్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని సూచించారు. కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ నిర్దేశించిన సమయంలో ఆయా శాఖల అధికారులు వారికి కేటాయించిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ధార్మిక సంస్థ సలహాదారుడు గోవింద హరి, ఎస్పీ సంకీర్త్, అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీసీ సునీత, ఈఓ మహేష్, సర్పంచ్ మోహన్‌రెడ్డి, ఉపసర్పంచ్ సుధీర్ పాల్గొన్నారు. పలుగుల, మద్దులపల్లి సర్పంచ్‌లు సరిత, విజయలక్ష్మి ఉన్నారు.
మే వరకు పనులు పూర్తి చేయాలి
రాష్ట్ర ఐటీ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
కాళేశ్వరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు


