కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని సమస్యలు తెలుసుకునేందుకు వచ్చా.. ఇక్కడి సమస్యలను శాసన మండలిలో ప్రస్తావించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. శుక్రవారం కేయూ సెనేట్ హాల్‌లో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను విన్నాక స్పందించారు. ఈ సందర్భంగా విద్యార్థులను, ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాబోయే శానసమండలి సమావేశాల్లో కాకతీయ యూనివర్సిటీలోని సమస్యలపై చర్చిస్తానన్నారు.పార్ట్ టైం లెక్చరర్లను కాంట్రాక్టు లెక్చరర్లుగా కన్వర్సన్ చేయించేందుకు, కాంట్రాక్టు లెక్చరర్లను మినిమం టైం స్కేల్ చేయించేందుకు కృషిచేస్తానని తెలిపారు. సుమారు 650 ఎకరాల భూమి ఉండాలని, తగ్గిపోయిందన్నారు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విషయంలో తాత్సారం చేస్తోందని ఈ విషయంలో తాను జాబ్ క్యాలెండర్ కంటే ముందే ఈడబ్లూఎస్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నానని వివరించారు.10 శాతం ఈడబ్లూఎస్ ఇవ్వటం సమంజసం కాదని 42శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వమంటే ఇస్తలేరని పేర్కొన్నారు.
ఏప్రిల్ 1నుంచి బస్సు సదుపాయం
వచ్చే నెల 1వ తేదీనుంచి ఇంజనీరింగ్ విద్యార్థులకు బస్సు సదుపాయం కల్పించేందుకు రిజిస్ట్రార్ రామచంద్రంతో మాట్లాడి అంగీకరింపచేశారు. అలాగే లైబ్రరీ ఉదయం 8గంటలనుంచి రాత్రి 10గంటలవరకు కూడా తెరిచే ఉంచేలా రిజిస్ట్రార్ అంగీకరించారు. ఈ సమావేశంలో బీసీ సెల్ డైరెక్టర్ డాక్టర్ బొడిగ సతీష్ పాల్గొన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న


