పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీని కాపాడండి
● ఝాన్సీరెడ్డిపై అసమ్మతి నేతల ఫిర్యాదు
తొర్రూరు రూరల్: పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని కాపాడాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను అసమ్మతి నేతలు కోరారు. తొర్రూరు మండలానికి చెందిన అసమ్మతి నాయకులు గురువారం కాంగ్రెస్ నాయకురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డిపై హైదరాబాద్‌లో ఫిర్యా దు చేశారు. ఈ సందర్భంగా తొర్రూరు మార్కెట్ చైర్మన్ హనుమాండ్ల తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్‌రావు మాట్లాడుతూ.. గత అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలను పార్టీ నాయకురాలు ఝాన్సీరెడ్డి విస్మరిస్తూ, తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఆమె పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నట్లు ఆరోపించారు. ఝాన్సీరెడ్డి తప్పుడు విధానాల వల్లే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సగం సర్పంచ్ స్థానాలను సైతం కాంగ్రెస్ పార్టీ గెలువ లేదన్నారు. ఇప్పటికై నా పాత, కొత్త తేడా లేకుండా నాయకులు, కార్యకర్తలందరినీ కలుపుకొని ముందుకెళ్తేనే రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలుస్తుందని, లేకుంటే ఒక్క స్థానం కూడా రాదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు రామసహాయం కిశోర్‌రెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ హనుమాండ్ల నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంచు సంతోష్, సర్పంచ్‌లు ధర్మారపు మహేందర్, కొమురవెల్లి లింగమూర్తి, నలుగురి రామలింగం, నాయకులు మేర్గు మల్లేశంగౌడ్, హనుమాండ్ల నరేందర్‌రెడ్డి, దేవరకొండ శ్రీనివాస్, తమడపల్లి సంపత్, బిజ్జాల వరప్రసాద్, సహదేవ్, మహేశ్, రాకేశ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.


