ఉపాధి కోల్పోయాం..
డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో ఉపాధి హామీ పథకం రద్దు కావడంతో ఉపాధి కోల్పోయామని సిగ్నల్‌తండా, రాజుతండాకు చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. డోర్నకల్ మున్సిపాలిటీని గ్రామపంచాయతీగా మార్చాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిగ్నల్‌తండా, రాజుతండాకు చెందిన మహిళలు గాంధీ సెంటర్‌లో ఆందోళనకు దిగారు. మున్సిపాలిటీ ఏర్పాటుతో తాము ఉపాధి కోల్పోయామని, వ్యవసాయ యాంత్రీకరణ, ఇతర రాష్ట్రాల కూలీలతో పనులు కూడా దొరకడం లేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మహిళలు నాలుగు గంటల పాటు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సీఐ చంద్రమౌళి, ఎస్సై వంశీధర్‌తో పాటు మున్సి పల్ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు నచ్చజెప్పడంతో మహిళలు ఆందోళన విరమించారు.


