పర్యాటకుల స్వర్గధామం ములుగు..
ఎస్‌ఎస్ తాడ్వాయి : ములుగు జిల్లా పర్యాటకుల స్వర్గధామమని, ప్రకృతి అందాలతోపాటు చారిత్రాత్మక నేపథ్యం కలిగిన పర్యాటక ప్రదేశాలు ఎన్నో నెలవై ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. ఈ మేరకు బుధవారం తాడ్వాయి మండల కేంద్రంలో ఎకో టూరిజం ఏటూరునాగారం వైల్డ్ లైఫ్‌లోని తాడ్వాయి వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్ రేంజ్, తాడ్వాయి హట్స్, రెండు సఫారీ వాహనాలను కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క.. అధికారులతో కలిసి సఫారీ వాహనంలో తాడ్వాయి వైల్డ్ లైఫ్ రేంజ్‌లో పర్యటించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు తాడ్వాయి హట్స్‌ను ఆధునికీకరించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. తాడ్వాయి మండల కేంద్రంలో జాతీయ రహదారికి పక్కన 6 హట్స్, 18 కిలోమీటర్ల మేర సఫారీ చేయడానికి 2 వాహనాలను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌కు సుమారు 250 కిలోమీటర్లు, హనుమకొండకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను చూడడానికి పర్యాటకులు విచ్చేయాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్ ఎఫ్‌డీఓ రమేశ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ
మంత్రి సీతక్క


