ఒకటే గమనం.. ఒకటే గమ్యం!
కొత్త సంవత్సరం.. సరికొత్త ఆశయాలు
‘పారే నది. వీచే గాలి. మండే నిప్పు. రుతువులకు అనుగుణంగా మారే ఆకాశం. చర్యలకనుగుణంగా స్పందించే భూమి పంచభూతాలన్నింట్లో చలనం ఉంది. ఒక్క మనిషిలో తప్ప’ అని ఓ కవి అన్నట్లుగా రుతువులు మారుతున్నాయి. కాలాలు పరిగెడుతున్నాయి. మరి మనం ఎక్కడున్నాం? ఈ కొత్త వత్సరంలోనైనా ఉమ్మడి వరంగల్ జిల్లా యువత ‘నూతన’ ప్రణాళికతో ముందుకు సాగాలి. విజయాన్ని బానిసగా మార్చుకోవాలి. – హన్మకొండ కల్చరల్
యువత లక్ష్యం వైపు గురి పెట్టాలి. రాష్ట్రంలో త్వరలో పోలీస్ కానిస్టేబుల్, ఇతరత్రా ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాల సాధించాలన్న లక్ష్యం ఏర్పరుచుకుని ఇప్పటినుంచే నిరంతరం ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. పట్టుదలతో చదివి ఉద్యోగాలను సృష్టించుకోవాలి. మరికొందరికి ఉద్యోగాల్ని కల్పించేలా ఎదగాలి. ఏఐ వచ్చాక ఉద్యోగాలన్నీ కృత్రిమ మేధతో నిండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఉద్యోగాలు ఎవరివ్వాలి. అలా ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి.
గతంలో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ టీవీ షోలో ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు రూ.కోటి గెలుచుకున్నాడు. ఏడాది తిరగకముందే మళ్లీ రూ.8 వేలకు మళ్లీ టీచర్‌గా ఉద్యోగంలో చేరాడు. పాఠశాలల్లో, కళాశాలల్లో ఏ ఉపాధ్యాయుడు చెప్పని ఆర్థిక పాఠాలు ఎవరికి వారే నేర్చుకోవాలి. చాలా మంది శక్తికి మించిన ఖర్చు చేస్తూ.. ఈఎంఐల పేరిట జీవితాలను చిన్న చిన్న ఉద్యోగాలకు తాకట్టు పెడుతున్నారు. వీలైనంత పొదుపు చేస్తూ పెట్టుబడుల వైపు మళ్లితే భవిష్యత్ భద్రంగా ఉంటుంది.
‘గ్రంథాలయాల్లో మిడిల్ ఏజ్, ఓల్డేజ్ పీపుల్ మాత్రమే కనిపిస్తున్నారు. మరి యువతరం ఎక్కడుంది అని పరిశీలిస్తే.. నిద్ర మత్తులో, సెల్‌ఫోన్లలో, టీవీల ఎదుట మునిగిపోయింది’ అని ఓ మాజీ ఐపీఎస్ అధికారి దిగ్భాంతి వ్యక్తం చేశారు. యువత ఫోన్లను, సామాజిక మాధ్యమాలను కాస్త దూరం పెట్టి గ్రంథాలయాల వైపు చూడాలి. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నవారంతా పుస్తకాలు చదివిన వారే. తల దించి నన్ను చూడు. తల ఎత్తుకునేలా నేను చేస్తాశ్రీ అంటుంది పుస్తకం.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక మంది యువత ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెడుతూ మోసపోతున్నారు. ఆన్‌లైన్ ఆర్థిక నేరాల్లో మోసపోతున్న వారు అత్యధికంగా యువకులు, ఉన్నత విద్యావంతులు. అధికారులే. సోషల్ మీడియాలో తెలియని లింకులు ఓపెన్ చేస్తూ.. ఇష్టారీతిన ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. డిజిటల్ యుగంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జీవితాల్లో వెలుగులు నింపాలి
సాక్షి, మహబూబాబాద్: ప్రపంచంలో అన్నింటి కన్నా విలువైనది కాలం. అందుకోసమే కాలం ఎవరికోసం ఆగదు. పాత సంవత్సరానికి వీడ్కోలు.. కొత్త సంవత్సరానికి స్వాగతం ప్రతీ ఏటా జరిగేదే. చిన్నతనంలో అమ్మానాన్నలతో, తర్వాత ఫ్రెండ్స్‌తో సంబురాలు జరుపుకుంటాం. కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తున్నాం. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు. ఇతర వ్యాపారాలు ప్రారంభించే వారు.. మొదటి రోజు నుంచే ప్రణాళికతో శ్రమించాలి. విజయం తప్పక సాధిస్తారు. ప్రధానంగా ఆరోగ్య విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దు. – పి.శబరీష్, ఎస్పీ, మహబూబాబాద్
కొత్త సంవత్సరం ప్రారంభమైన రెండో నెలలో ఇంటర్, మార్చిలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఉంటాయి. జిల్లానుంచి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకుంటారు. సిలబస్ పూర్తయి రివిజన్లు చేసుకోవాలి. పరీక్షలకు కొంత సమయమే ఉంది కాబట్టి మరోసారి రివిజన్లు చేసుకుంటూ షార్ట్ నోట్స్ రాసి పెట్టుకోవాలి. అప్పుడే చదివింది గుర్తుండి పరీక్షలకు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది.
సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ బాల్య స్నేహితులు. ఒకేసారి కెరీర్ ప్రారంభించారు. కానీ సచిన్ క్రికెట్ ప్రపంచంలో ఆరాధ్యుడయ్యాడు. వినోద్ కాంబ్లీ అపరిచితుడుగా మారిపోయాడు. సచిన్ విజయానికి కారణం క్రమశిక్షణ. మంచి వ్యక్తిత్వం. నిజాయితీ, క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఎప్పటికై నా ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని నేటి యువత గ్రహించాలి. వ్యాయామం మన ఆరోగ్యానికి, దేహదారుఢ్యానికి ఎంతో దోహదం చేస్తుంది. ఇన్నిరోజులు బద్ధకంగా ఉన్నా కొత్త సంవత్సరంలోనైనా వ్యాయామం చేయాలన్న నిర్ణయం తీసుకుని అమలు చేయాలి.
అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలి
నూతన సంవత్సరం జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలి. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో జిల్లా అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నా. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకొని జీవన ప్రమాణాలు పెంచుకోవాలి. నూతన సంవత్సరం ప్రజల జీవితాల్లో కొత్త దనం సంతరించుకోవాలి. మొదలు పెట్టిన ప్రతీ పని విజయవంతం కావాలి. జిల్లా ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
– అనిల్ కుమార్, అదనపు కలెక్టర్(రెవెన్యూ), మహబూబాబాద్
ప్రణాళిక.. కార్యరూపం..
క్షేత్రస్థాయి శ్రమ
అన్నింటినీ సమన్వయం చేసుకుంటే అద్భుత విజయం
ఉమ్మడి వరంగల్ జిల్లా యువతలో
నయా జోష్


