మున్సి‘పాలిటిక్స్‌’ | - | Sakshi
Sakshi News home page

మున్సి‘పాలిటిక్స్‌’

Jan 1 2026 1:52 PM | Updated on Jan 1 2026 1:52 PM

మున్సి‘పాలిటిక్స్‌’

మున్సి‘పాలిటిక్స్‌’

సాక్షి, మహబూబాబాద్‌: గ్రామ పంచాయతీ ఎన్ని కల సందడి ముగిసింది. ఇదే ఊపులో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్‌, ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందనే సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో తమ బలం నిరూపించుకునేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌తోపాటు, బీజేపీ నాయకులు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు.

పోటాపోటీగా సమావేశాలు

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నుంచి మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ సంకేతాలు రావడంతో జిల్లాలోని ప్రధాన పార్టీల్లో సందడి మొదలైంది. మహబూబాబాద్‌, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్‌, కేసముద్రం మున్సిపాలిటీల వారీగా పార్టీ నాయకులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి మానుకోట నియోజకవర్గంలోని మహబూబాబాద్‌, కేసముద్రం అభ్యర్థుల ఎంపిక విషయంపై స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్‌ ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించి రిజర్వేషన్‌ ఏదైనా కావచ్చు.. మీరు మాత్రం సిద్ధంగా ఉండాలని చెప్పారు. అదేవిధంగా కేసముద్రం మున్సిపాలిటీ నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఆశావహులు స్థానిక నాయకులు, కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ గంట సంజీవరెడ్డితో కలిసి వెళ్లి సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డికి తమ అభిప్రాయాలను చెప్పినట్లు తెలిసింది. డోర్నకల్‌, మరిపెడ మున్సిపాలిటీల అభ్యర్థుల ఎంపిక విషయంపై ఎమ్మెల్యే రాంచంద్రునాయక్‌ ముఖ్య కార్యకర్తలకు సంకేతాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తొర్రూరు మున్సిపాలిటీలో తమ వర్గం నుంచి బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టీపీసీసీ నాయకులు ఝాన్సీరెడ్డి కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది.

బీఆర్‌ఎస్‌లో మొదలైన సందడి..

పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా.. మెరుగైన ఫలితాలు వచ్చాయని చెబుతున్న బీఆర్‌ఎస్‌ నాయకులు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరవేయడం కోసం సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన కేటీఆర్‌ సభకు ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడం, అందరు కలిసికట్టుగా మున్సిపల్‌ ఎన్నికల్లో పనిచేయాలని జిల్లా నాయకులకు హితవు చెప్పారు. దీంతో తమ వర్గాలకు చెందిన నాయకులను కౌన్సిలర్లుగా బరిలో దింపి గెలిపించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే ఐదు మున్సిపాలిటీల నుంచి ఆశావహుల జాబితాను సిద్ధం చేసినట్లు ప్రచారం. ఇదులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌, మాజీ ఎంపీ కవిత, మాజీ మంత్రులు రెడ్యానాయక్‌, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తమ అనుచరులతో మున్సిపల్‌ ఎన్నికల విషయంపై చర్చించినట్లు ప్రచారం.

రిజర్వేషన్లపై చర్చ..

మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్న అన్ని పార్టీల నాయకులు రిజర్వేషన్‌పై చర్చ జరుగుతోంది. అయితే కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం రొటేషన్‌ పద్ధతిన రిజర్వేషన్‌ ఉంటుందని సంకేతాలు వస్తున్నా.. రొటేషన్‌లో ఏం జరుగుతుందో అనేది ఉత్కంఠనే.. అదే విధంగా మున్సిపల్‌ చైర్మన్ల రిజర్వేషన్‌ స్టేట్‌ ప్రాతిపదికన జరిగే అవకాశం ఉన్నందున ఆ జాబితాను పరిశీలించిన తర్వాతే కొందరు కీలక నాయకులు బరిలో దిగేందుకు సిద్ధం అవుతున్నారు. దీనిపై సంక్రాంతి తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మొదలైన మున్సిపల్‌ ఎన్నికల సందడి

వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికకు సమాయత్తం

రిజర్వేషన్లకు అనుగుణంగా

సిద్ధం కావాలని పిలుపు

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పోటాపోటీగా

సమావేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement