కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి
మహబూబాబాద్ రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ పరిశీలకులు పోట్ల నాగేశ్వరరావు, కూచన రవళిరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకుని మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని శ్రేణులకు విజ్ఞప్తి చేశా రు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నా యకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి పాటుపడాలన్నారు. అంకితభా వం, అనుభవం, ప్రజా సేవ కలిగిన వారిని గుర్తించి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, అధికార ప్రతినిధులు తదితర కీలక పదవులను పార్టీ శ్రేణుల నుంచి దరఖాస్తులు స్వీకరించి భర్తీ చేయనున్నామని తెలిపారు. జిల్లా కార్యవర్గంలో మహిళలకు 20 నుంచి 30 శాతం మేరకు పార్టీ పదవుల్లో అవకాశం కల్పిస్తామని తెలిపారు. వ్యక్తుల కోసం కాదని పార్టీ కోసం పని చేసే వారికి జిల్లా కార్యవర్గంలో స్థానం కల్పిస్తామని కార్యకర్తలకు భరోసానిచ్చారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పదేళ్లకాలంలో బలప్రయోగం ద్వారా ఎన్నికలు జరిగా యని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యయుతంగా, ఎలాంటి బలప్రయోగం లేకుండా జీపీ ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉమ, ఎమ్మెల్యేలు భూక్య మురళీనాయక్, కోరం కనకయ్య, అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజయ్య, మానుకోట, ఇల్లెందు ఏఎంసీ చైర్మన్లు ఇస్లావత్ సుధాకర్, బానోత్ రాంబాబు, పార్టీ నేతలు పాల్గొన్నారు.


