అయ్యో.. అమ్మ!
● వృద్ధురాలిపై నుంచి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
● అక్కడికక్కడే దుర్మరణం..పరకాల బస్టాండ్‌లో ఘటన
పరకాల: పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్టాండ్‌లోకి వెళ్తున్న బస్సు వృద్ధురాలిపై నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణం కోల్పోయింది. స్థానికుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా పల్సాబ్‌పల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు తోట రాధమ్మ(70) తన మనవరాలు ప్రసవించడంతో బంధువులతో కలిసి చెన్నాపూర్ బయలుదేరింది. పరకాల బస్టాండ్‌కు చేరుకుని భూపాలపల్లి వైపు వెళ్లే బస్సు ఎక్కడానికి ముందు బయట పండ్లు తీసుకునేందుకు వెళ్తోంది. ఈ సమయంలో వరంగల్– 2 డిపో బస్సు బస్టాండ్‌లోకి వెళ్లే క్రమంలో వృద్ధురాలిపై నుంచి దూసుకెళ్లగా అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికులు కేకలు వేస్తూ విగతజీవిగా మారిన వృద్ధురాలిని చూసి కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆర్టీసీ బస్సుతో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.


