వినతులు సత్వరమే పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
● ప్రజావాణిలో 86 అర్జీల స్వీకరణ
మహబూబాబాద్: ప్రజావాణిలో ఇచ్చిన వినతులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా.. అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్ వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా లెనిన్ వత్సల్ టొప్పో మాట్లాడుతూ.. పెండింగ్ వినతులు కూడా త్వరగా పరిష్కరించాలని, పరిష్కారం చేయలేనవి ఉంటే కారణాలతో కూడిన నివేదిక ఇవ్వాలన్నారు. సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి అనే విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పని చేయాలన్నారు. ప్రజావాణిలో 86 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
యూరియా బస్తాలు ఇప్పించాలి
ఇందిరానగర్ తండా జీపీ గతంలో కేసముద్రం మండలంలో ఉండగా ఇటీవల మానుకోట మండల పరిధిలోకి మార్చారు. దీంతో మండలం సమస్య వస్తుంది. మా భూములన్నీ కేసముద్రం మండల పరిధిలో ఉన్నాయి. మండలం సమస్యను సాకుగా చూపి అధికారులు యూరియా బస్తాలు ఇవ్వడం లేదు. సమస్యను పరిష్కరించి బస్తాలు ఇవ్వాలి.
–డి.లాల్ సింగ్–మంగమ్మ దంపతులు,
ఇందిరానగర్ కాలనీ జీపీ
ఇందిరమ్మ ఇంటి బిల్లు రాలేదు..
ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యింది. వెంటనే పాత ఇల్లు కూల్చివేసి నూతన ఇంటి నిర్మాణం చేపట్టాం. బేస్‌మెంట్‌తో పాటు బీమ్‌ల నిర్మాణం పూ ర్తయి ఆరు నెలలు అవుతున్నా బిల్లు రాలేదు. ఆధా ర్ నమోదు కాలేదని చెప్పడంతో.. హౌజింగ్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా చేయడం లేదు. వెంటనే బిల్లు ఇస్తే మిగిలిన పనులు చేపడుతాం.
–సట్ల మాధవి, భగత్‌సింగ్ నగర్‌కాలనీ,
మానుకోట పట్టణం
భూములు కబ్జా కాకుండా చూడాలి
మాకు జిల్లా కేంద్రం శివారులోని హైమాగార్డెన్ వెనుక ఆరు ఎకరాల భూమి ఉంది. దానిని కొంత మంది ఆక్రమించుకుంటున్నారు. ఇప్పటికే ఎకరం ఆక్రమణకు గురైంది. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి. – ఆకుల లక్ష్మి
వినతులు సత్వరమే పరిష్కరించాలి
వినతులు సత్వరమే పరిష్కరించాలి
వినతులు సత్వరమే పరిష్కరించాలి


