జీవన ఎరువులతో అధిక దిగుబడులు
● మహబూబాబాద్ ఏడీఏ
అజ్మీరా శ్రీనివాస్
గార్ల: రైతులు పంటల్లో జీవన ఎరువులు, ఎన్‌పీకే గుళికలు, పీఎస్‌బీ ద్రావణం వాడడం వల్ల తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించి ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని మహబూబాబాద్ ఏడీఏ అజ్మీరా శ్రీనివాస్ సూచించారు. మంగళవారం మండలంలోని సీతంపేట గ్రామ సమీపంలో జీవన ఎరువులతో రైతు బాలాజీ సాగుచేసిన మొక్కజొన్న పంటలో క్షేత్ర ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు రసాయనిక ఎరువులు తగ్గించి జీవన ఎరువులు వాడడం వల్ల తక్కువ పెట్టుబడితో చీడపీడలను నివారించవచ్చన్నారు. అపరిమితంగా రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడడం వల్ల భూమి సారం కోల్పోతుందన్నారు. కొన్నేళ్ల తర్వాత పంటలు పండవని ఆవేదన వ్యక్తం చేశారు. అదే జీవన ఎరువులు మొక్క ఆరోగ్యంగా ఎదగడానికి దోహదపడుతాయని సూచించారు. జీవన ఎరువులు రైతులకు అన్ని విధాలా లాభదాయకం అన్నారు. రబీలో రైతులు వరిపంటకు జీవన ఎరువులు వాడుకోవాలని సూచించారు. ఏడీఏ వెంట ఏఓ కావటి రామారావు, రైతులు మాలోత్ బిక్షం తదితరులు ఉన్నారు.


