మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
మహబూబాబాద్ అర్బన్: మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ, డైనింగ్ హాల్, వంటశాల గదులు, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలన్నారు. చలికాలం నేపథ్యంలో విద్యార్థులకు మెనూ ప్రకారం వేడివేడి ఆహారం అందించాలన్నారు. రాత్రివేళలో విద్యార్థులు చలి తీవ్రతను తట్టుకునే విధంగా ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించాలన్నారు. స్నానానికి వేడి నీరు అందించాలన్నారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, మానసిక ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించాలని, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాభ్యాసం చేయించాలన్నారు. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు వారి పరిధిలో ఉన్న సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలను తనిఖీ చేయాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపా ల్ రాజేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


