పదో తరగతిలో వందశాతం ఫలితాలే లక్ష్యం
మహబూబాబాద్ అర్బన్: గిరిజన పాఠశాలల్లో పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఫలితాలే లక్ష్యంగా విద్యార్థుల సామర్థ్యాలు పెంచాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి గుగులోతు దేశీరాంనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో మంగళవారం ఆశ్రమ పాఠశాలల హెచ్‌ఎంలు, వార్డెన్లు, ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుగులోతు దేశీరాం నాయక్ మాట్లాడుతూ.. 60 రోజుల నిర్ధిష్ట ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ప్రతీ రోజు ఉదమం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారంతో పాటు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు. వసతి గృహాల్లో చిన్న చిన్న మరమ్మతులు త్వరితగతిగా పూర్తి చేయాలని ఏఈలను ఆదేశించారు. పరిసరాలు పరిశుభ్రతతో పాటు మరుగుదొడ్లు, బాత్‌రూమ్‌లను శుభ్రంగా ఉంచాలని, శానిటైజేషన్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఏటీడీఓలు భాస్కర్, ఉపేందర్, ఏసీఎంఓ రాములు, డిప్యూటీ ఈఓ సారయ్య, జీసీడీఓ విజయ, డీఆర్పీ శ్రీకాంత్, ఏఈ లు ఎర్రయ్య, శోభన్, శ్రీను, పాఠశాల హెచ్‌ఎంలు నర్సయ్య, కిషన్‌నాయక్, కోటేశ్వరి, వార్డెన్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


