టార్గెట్ జనవరి 5..
నేడు గోవిందరాజు,
పగిడిద్దరాజు గద్దెల పునఃప్రతిష్ఠ
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణ పనులన్నీ డిసెంబర్ 31 కల్లా పూర్తి చేయాలని, అటు ఇటు అయితే జనవరి 5 కల్లా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం మేడారంలోని హరితహోట్‌లో మంత్రి సీతక్క, సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ బలరాంనాయక్, కలెక్టర్ దివాకర్ టీఎస్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా పనుల పురోగతి వివరాలను అధికారులు మంత్రులకు వివరించారు.
ప్రాకారం పనులపై సుదీర్ఘ సమీక్ష
అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో జరుగుతున్న ప్రాకారం రాతి నిర్మాణ పనులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సుమారు అరగంటకుపైగా సమీక్షించారు. ప్రాకారం చుట్టూ రాతి స్తంభాల ఏర్పాటుతోపాటు వాటిపై డిజైన్ ఏర్పాట్ల పనులు, గోవిందరా జు, పగిడిద్దరాజు గద్దెల పునరుద్ధరణతోపాటు అమ్మవార్ల గద్దెల విస్తరణలో భాగంగా రాతి నిర్మాణ పనులన్నీ డిసెంబర్ 31 వర కు పూర్తి చేయాలని ఆదేశించారు. జనవరి 5వ తేదీ లోపు ఎప్పుడైనా ఎవరికీ తెలియకుండా విజిట్ చేస్తానని, పనుల్లో లోపాలు ఉంటే సహించేది లేదన్నారు. జనవరి 6వతేదీన సీఎం రేవంత్‌రెడ్డి వచ్చే చాన్స్ ఉందని, ఆలోగా పనులన్నీ పూర్తి చేయాలన్నారు.
స్వస్తిక్ గుర్తు ఆదివాసీల సంప్రదాయమే..
స్వస్తిక్ గుర్తును ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయం ప్రకారం ఏర్పాటు చేస్తున్నామని, దీనిపై ఎవరూ రాద్ధాంతం చేయొద్దని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కోరారు. ప్రకృతి దైవాలుగా భావించి సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గొట్టు, గోత్రాల ప్రకారం పనులు చేస్తున్నారన్నారు. కాగా, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునఃప్రతిష్ఠ పూజ కార్యక్రమాల సందర్భంగా నేడు (బుధవారం) అమ్మవార్ల దర్శనాలు నిలిపివేసినట్లు పూజారులు ప్రకటించారని, భక్తులు సహకరించాలన్నారు.
క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన
జాతర పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధనసరి సీతక్క క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అంతకుముందు మంత్రులు శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, సీఎం ముఖ్య సలహాదారు నరేందర్‌రెడ్డి, ఎంపీ బలరాంనాయక్ అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవీచందర్ ఉన్నారు.
మేడారం గద్దెల ప్రాంగణంలో పునరుద్ధరించిన గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై నేడు (బుధవారం) ధ్వజ స్తంభాల పునఃప్రతిష్ఠ పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈమేరకు మంగళవారం గోవిందరాజు, పగిడిద్దరాజు పూజారులు పూజ కార్యక్రమాలను సిద్ధం చేశారు. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు పూజారులు, కొండాయి నుంచి గోవిందరాజు పూజారులు వారి గుడిల వద్ద పూజాకార్యక్రమాలు నిర్వహించుకుని మంగళవారం రాత్రి మేడారానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో గోవిందరాజు, పగిడిద్దరాజు ధ్వజ స్తంభాల ను నిలపనున్నట్లు పూజారులు తెలిపారు.
ఆ లోపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
అధికారులకు మంత్రి పొంగులేటి డెడ్‌లైన్
క్షేత్ర స్థాయిలో పనులు పరిశీలించిన మంత్రులు


