ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి
నెహ్రూసెంటర్: ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దృష్ట్యా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తూ రోజుకు 10వేల చొప్పున గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఫారం 8 ద్వారా అసలైన ఫొటోగ్రాఫ్ సేకరించి నవీకరించాలని ఈ ప్రక్రియ జనవరి 2026లోగా పూర్తి చేయాలని తెలిపారు. వీసీ అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై బీఎల్‌ఓలతో సమీక్షించి పురోగతి సాధించాలని సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్ కె.అనిల్‌కుమార్, ఆర్డీ ఓ కృష్ణవేణి, పరిపాలన అధికారి పవన్‌కుమార్, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.
మేడారంలో నేడు మంత్రుల పర్యటన
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో నేడు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమచార, పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క పర్యటించనున్నారు. సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి, జాతర పనులను పరిశీలించనున్నారు. అనంతరం జాతర అభివృద్ధి పనుల ఏర్పాట్లపై అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.


